పౌర రవాణా పట్టదా?
విశ్లేషణ
నగరాలు, పలు నగర ప్రాంతాలుగా వృద్ధి చెందుతున్నాయి. ప్రతి కేంద్రాన్ని మరో దానితో అనుసంధానించడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చాలా అవసరం. కాబట్టి ఏకీకృత మెట్రో పాలిటన్ రోడ్డు రవాణా వ్యవస్థ చాలా ఉపయోగకరం.
మనకో బుల్లెట్ ట్రైన్ రాబోతున్నదనేది నిజం. మన రైల్వే వ్యవస్థలోని భద్రతాపరమైన సమస్యలు చాలావరకు పరిష్కారం కాకుండానే ఉన్నా కూడా... అది మన పౌర రవాణా వ్యవస్థకు అత్యంత ఖరీదైన సంకేతం. రవాణా రంగంలోని పెరుగుతున్న అవసరాలు, అరకొర సదుపాయాలు కలసి పౌరులను నివారించదగిన కష్టాలకు గురిచేస్తున్నాయనేది కూడా వాస్తవమే. ఎంతో కాలం క్రితమే పూర్తి కావాల్సిన మెట్రోలు, రోడ్లు కిక్కిరిసిపోయాక ఇప్పుడు నిర్మితమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా సదుపాయాల ప్రణాళికల రూపకల్పన, అమలులో పాదచారులను, సైకిల్ వాలాలను కర్మకు వదిలేశారు. రోడ్డు పక్క కాలిబాటలను ఎవరో ఆక్రమించేసుకుని ఉంటారు కాబట్టి వాటిపై మీరు నడవ లేరు, రోడ్ల మీద సైకిల్ తొక్కనూ లేరు.
నేను నివసించే థానే, ఇటీవలే 20 లక్షల జనాభాను దాటిన జనసమ్మర్దతగల నగరం. తలా తోకాలేని లేదా ప్రణాళికా రచన దాదాపు పూర్తిగా లోపించడం... ఒక నగరాన్ని ఎలాంటి చిక్కుముళ్లలో బంధిస్తుందనడానికి అది ఒక ఉదాహరణ. అత్యంత శక్తివంతమైన అతి వేగవంతమైన పౌర రవాణా సదుపాయాల గురించి 1987 లోనే చర్చించినా నేటికీ ఇంకా డిజైన్ల రూపకల్పన దశకు చేరలేదు. గత దశాబ్దకాలంగా ప్రైవేట్ కార్లు బహిరంగ రహదారులకు అడ్డుకట్టలుగా మారుతున్నాయి. థానేలో బస్సుల నిర్వహణ అత్యంత అధ్వానం. బస్సుల్లో చాలా వరకు, పౌర రవాణాకు ఉపయోగించడం మొదలెట్టే నాటికే శిథిలావస్థకు చేరుతుంటాయి. విడి భాగాలు కనుమరుగవుతుండటంతో ఆమోదయోగ్యమైన స్థాయిలో వాటిని నడపడం కష్టమౌతుంటుంది. రాజకీయవేత్తలతో కుమ్మక్కయిన ప్రైవేటు ఆపరేటర్లు చట్టవిరుద్ధంగా బస్సులను లాభదాయకంగా తిప్పుతుంటారు.
రవాణా సదుపాయాలను కల్పించాల్సిన ప్రభుత్వమే వీటిని సక్రమమైన పద్ధతిలో పెట్టాలి. కానీ చాలా రాష్ట్రాల్లో నగరాల లోపలి రూట్ల బస్సు సర్వీసులను సైతం అధ్వానంగానే నిర్వహిస్తుంటారు. దేశంలో ఎక్కడా సమంజసనీయమైన, సౌఖ్యకరమైన, సమర్థవంతమైన, అందుబాటులో ఉండే, సురక్షిత స్థానిక రవాణా సేవలు ఎంత గాలించినా కనబడవు. ప్రతి నగరమూ, నగరాంతర్గత లేదా పట్టణ సముదాయాంతర్గత రవాణా వ్యవస్థపై ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అయినా కార్లు, స్కూటర్లు, ఆటోరిక్షాలపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడా పార్కింగ్ స్థలాలు ఉండవు. పాదచారుల భద్రతను విస్మరిస్తారు. స్పీడ్ బ్రేకర్‌లు కని పించకుండా పోతాయి లేదా వాటిని అసలు నిర్మించరు. ప్రైవేటు మోటారు వాహనాలకే ప్రాధాన్యం లభిస్తుంది కాబట్టి పాదచారులు రోడ్లు క్రాస్ చేయడానికి ఉపయోగపడే స్థలాల గురించిన యోచనే ఉండదు.
నాగపూర్‌లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రవేశించనున్నారు. నగర పాలక సంస్థ అప్రతిష్టకు తగ్గట్టే వారు సకాలంలో చెల్లింపులు జరిగేలా పనిని బట్టి నిర్ణీత కాలానికి నగదు చెల్లింపు (క్యాష్ ఇన్ ఎస్‌క్రో) ఒప్పందాలను కోరుతున్నారు. సమర్థవంతమైన లోకల్ ట్రైన్లను, ముని సిపల్ కార్పొరేషన్ నిర్వహణలోని బస్సు రవాణాను, నలుపు–పసుపు ట్యాక్సీ క్యాబ్‌లను, ఇçప్పుడు ఉబర్, ఓలా తదితర కార్లను చూస్తే... ముంబై నగరానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇవన్నీ కలసి ప్రైవేటు, ప్రభుత్వ వాహనాల వేగాన్ని కొన్ని చోట్ల గంటకు నాలుగు కిలో మీటర్లకు తగ్గించేశాయి.
బృహత్తర మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తలపెట్టిన మెట్రోలు ఇంకా మొదలు కానే లేదు. ఆ వ్యవస్థ నిర్మాణం పూర్తి కావడానికి మరో దశాబ్దిన్నర కాలమైనా పడుతుంది. కానీ అవి మాత్రమే సరి పోవు. ప్రతి చిన్న పట్టణంలోనూ ఉన్న పని ప్రదేశాలకు తక్కువ దూరమే ప్రయాణించాల్సి వచ్చేలా మెట్రో పాలి టన్ ప్రాంతంలోని కొత్త కేంద్రాల వద్ద నూతన ఆర్థిక కార్యకలాపాలు ఏమీ లేకున్నా జనాభా వృద్ధి చెందుతోంది. నగర పాలక సంస్థలు వాటిని నడపలేవనే వాస్తవాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి గానీ గుర్తించ లేదు. ముంబై నగర రవాణా సంస్థ బెస్ట్ దాదాపు దివాలా అంచులకు చేరింది. బస్సుల, ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయి అది తన ఉద్యోగులకు సకాలానికి జీతాలను చెల్లించలేకపోతోంది. దానికి ఆర్థిక సహా యాన్ని అందించి, దాని కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలనే విషయం పరిగణనలో ఉంది.
అది సైతం బ్యాండ్ ఎయిడ్ పట్టీ వేయడమే అవుతుంది. ముంబైతో పాటూ మెట్రో పాలిటన్ ప్రాంతంలోని థానే, నవీ ముంబై, పన్వెల్, కల్యాణ్–డోంబివిలి, ఉల్లాస్‌నగర్, మీరా–భయందర్, భివాండి–నిజాంపూర్, వసాయ్–వీరార్ నగరాలన్నీ తమ చిన్న భౌగోళిక ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలను అందించడంలో విఫలమయ్యాయి. ఈ నగరాలన్నింటి వద్ద అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను అన్నిటినీ కలిపి, మెట్రో ప్రాంతం అంతటా వాటిని అభిలషణీయం స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే ఆలోచన సైతం ప్రభుత్వానికి తట్టలేదు. అది చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఏకీకృతమైన మెట్రో పాలిటన్ రోడ్డు రవాణా వ్యవస్థ నగర ప్రజలకు ఒక వరమే అవుతుంది. నగరాలు, నగర ప్రాంతాలుగా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ప్రతి కేంద్రాన్ని మరో దానితో అనుసంధానించడం ఆర్థికవ్యవస్థ ముమ్మరంగా కార్యకలాపాలు సాగించడానికి చాలా అవసరం. కాబట్టి ఇది కొంత ఆలోచించాల్సిన విషయం.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com