రాజధాని అమరావతి నిర్మాణానికంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పేరిట తీసుకున్న భూముల్లో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయి. పేద, సన్న, చిన్న కారు రైతులను అడ్డగోలుగా మోసగించి స్థానిక నాయకులు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల వరకు సొంతం చేసుకున్నారు. పెద్దల ముసుగులో కొందరు, ప్రజాప్రతినిధుల అనుచరుల పేరిట మరికొందరు, బడాబాబులుగా చెలామణి అయినవారు... ఎవరి స్థాయిలో వారు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. ప్రభుత్వ భూములను కాజేశారు. దేవదాయ, వక్ఫ్ ఆస్తులతో పాటు వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, చేద బావులు, శ్మశాన స్థలాలను కాజేశారు. చివరకు రోడ్లను కూడా కలిపేసుకున్నారు.
సాక్షి, కృష్ణా: తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామ పరిధిలో భూ సమీకరణలో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎకరానికి రెండు నుంచి 70 సెంట్ల వరకు అక్రమంగా నొక్కేశారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులు, కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయి గ్రామంలోని వెనుకబడిన వర్గాలు, ఎస్సీల భూములను కాజేశారు. పూలింగ్‌కు భూమి ఇవ్వకపోతే అది అలాగే మిగిలిపోతుంది. ఎందుకూ పనికిరాదు. చివరకు ప్రభుత్వం లాగేసుకుంటుంది అని బెదిరించారు. సర్వేలో వాస్తవ భూమిని తగ్గించేసి పలుకుబడి కలిగిన ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులకు రికార్డుపరంగా ఇచ్చేశారు.
కావేవీ కబ్జాకు అనర్హం
నెక్కల్లు గ్రామ సర్వే నెంబరు 54లో చెక్‌డ్యాం నిర్మితమైంది. దీనికి సంబంధించిన 1.24 ఎకరాలను చేజిక్కించుకున్నారు.
- సర్వే నెంబరు 159 లో కోమటిగుంట (చెరువు) ఉంది. దీనిలో నుంచి 77 సెంట్లను పూలింగ్ కింద ఇచ్చి ప్లాట్లను కొట్టేశారు.
- సర్వే నెంబరు 162లో కొండ వాగు ఉంది. దీనిలో 93 సెంట్లు ఆక్రమించేసి పూలింగ్‌కు ఇచ్చారు.
- సర్వే నెంబరు 88లో గ్రామ ఊరచెరువు ఉంది. ఇందులో 31.50 సెంట్లు చేజిక్కించుకుని పూలింగ్‌కు కేటాయించారు.
- సర్వే నెంబరు 105లో రోడ్డు ఉంది. దీన్ని బొమ్మల రోడ్డు అని పిలుస్తారు. రోడ్డుకు చెందిన 1.15 ఎకరాలను డీకే పట్టాగా పొంది పూలింగ్ కింద ఇచ్చారు. ఇలాంటివి వెలుగులోకి రాని భూ అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయని నెక్కల్లు గ్రామానికి చెందిన పలువురు ‘సాక్షి’కి తెలిపారు.
- గ్రామేతరులకు అసైన్డ్ భూములు నెక్కల్లు గ్రామ పరిధిలోని అసైన్డ్ భూములు ఇతర మండలాల వారికి అధికారులు రాసిచ్చేశారు. స్థానిక పేదలకు దక్కిన వాటిని మభ్యపెట్టి మరీ ఇతరులతో కలిసి అధికారులు పంచేసుకున్నారు.
- నెక్కలు సర్వే నెం.162/2లో 92 సెంట్లను మంగళగిరి మండలం కాజకు చెందిన ఎ. సాంబయ్యకు, అదేసర్వే నెం.లో 93 సెంట్లను తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ఎన్. బ్రహ్మంకు అధికారులు రాసిచ్చేశారు.
- కాజకు చెందిన ఎ.సాంబశివరావుకు సర్వే నెం.105లో 1.1 ఎకరం, అదే గ్రామస్తుడైన ఎ.వెంకయ్యకు 162లో 92 సెంట్లు 54/2లో 75 సెంట్లు, 159లో 77, 54/2లో 76 సెంట్లు చొప్పన కాజ గ్రామస్తుడైన శ్రీనివాసరావు, 106లో వెంకటరమణకు ఒక ఎకరం, 159లో కె. రమణకుమారికి ఎకరం, 105లో 1.15 ఎకరాలు కాజ గ్రామానికి చెందిన ఆర్ శ్రీనివాసరావుకు రాసిచ్చారు.
అక్రమాలు ఎలా బయటపడ్డాయంటే..
మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏర్పాటైన జేఏసీ ఉద్యమం కొనసాగింపునకు చందాలకు సిద్ధమైంది. రాజధాని గ్రామాల్లోని రైతులు ఒక్కో ఎకరానికి రూ.పది వేలు చొప్పున ఇవ్వాలని తీర్మానించి తొలివిడతగా రూ.రెండు వేలు చొప్పున వసూళ్లు ప్రారంభించింది. నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ తన వంతుగా పెద్దమొత్తాన్ని ఇవ్వడాన్ని గుర్తించిన స్థానికులు రికార్డుల్లో ఎంత భూమిని చూపారనేది ఆరా తీశారు. వాస్తవ భూమికన్నా అదనపు భూమి రికార్డుల్లో ఉందని, ఆ అదనపు భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది పరిశీలింపజేశారు. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టల భూమిని త గ్గించేసి రావెల, ఆయన అనుచరులకు ఇచ్చా రని తేటతెల్లమైంది. ఇదే అంశమై తుళ్లూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
ప్రశ్నించడంతో చక్కదిద్దే పనిలో అధికారులు..
సీఆర్‌డీఏ ఏర్పడినప్పటి నుంచి అధికారిణి ఒకరు నెక్కల్లులోనే పనిచేస్తున్నారు. తెలుగుదే«శం ప్రభుత్వం పోయి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పేదలకు గొంతుక వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు. తమ భూములు తగ్గించి ఓ సామాజికవర్గం నేతల పేరిట రాశారని ఆ మహిళా అధికారిని నిలదీశారు. అందుకు తగి న ఆధారాలను కూడా చూపడంతో తప్పుల ను కప్పిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యా రు. రావెలకు కేటాయించిన పది ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లు (101/2020, 102/2020, 103/2020, 104/2020, 105/2020, 106/2020, 107/2020, 108/2020 )ను తాజాగా రద్దుచేశారు. రెండు డాక్యుమెంట్లు ఇంకా రద్దు కాలేదు. కాగా రావెల ఇతరులకు విక్రయించిన అయిదు ప్లాట్ల డాక్యుమెంట్లను మాత్రం రద్దు చేయలేదు.
న్యాయం చేయాలి
‘మా గ్రామంలో అక్రమాలు జరిగాయి. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టలకు చెందిన పేద రైతులకు చెందిన భూములను గ్రామంలో పెద్దమనుషులుగా చెలామణి అయిన వారు కాజేశారు. వారికి అప్పటి సీఆర్‌డీఏ అధికారు లు సహకరించారు. సర్వే పేరిట దారుణ మో సాలకు ఒడిగట్టారు. కౌలు పొందారు. ప్లాట్లు తీసుకున్నారు. వాటిని అమ్ముకుని కోట్లకు కోట్లు కొల్లగొట్టారు’. మాలాంటి పేదలు 29 గ్రామాల పరిధిలో ఎందరో నష్టపోయిన వారున్నారు. ప్రభుత్వమే పేదలకు న్యాయం చేయాలని నెక్కల్లు వాసులు కోరుతున్నారు.
భూమి సర్వే పేరిట ప్రారంభించి..
రాజధాని భూసమీకరణ పేరిట నెక్కల్లులో సీఆర్‌డీఏ పర్యవేక్షణలో జరిగిన సర్వేలో అక్రమాలు కోకొల్లలు అనడానికి ఉదాహరణ మచ్చుకు..
- గుమ్మా సదాశివరావుకు సర్వేనెంబరు 157బిలో 1.41 ఎకరాలు ఉండగా 1.32 ఎకరాలు ఉందని తేల్చారు. అదేవిధంగా గుమ్మా కాటంరాజుకు కూడా 1.41 ఎకరాలు అదే సర్వేనెంబరులో ఉండగా 97 సెంట్లు మాత్రమే ఉందని నిర్ధారించారు. మొత్తం 2.82 ఎకరాలలో 51 సెంట్లు లేనట్లు లెక్కతేలింది. బీసీ వర్గానికి చెందిన ఈ సోదరులు తమకు అన్యాయం జరిగిందని ఎందరి చుట్టూ తిరిగినా ఎవరూ చెవికెక్కించుకోలేదు.
- 83 సంవత్సరాల గంగారపు రత్తమ్మ, 76 ఏళ్ల బడిగంచుల కొండమ్మ అక్కచెల్లెళ్లు. సర్వేనెంబరు 164 డి లో ఒక్కొ క్కరికి 1.10 చొప్పున 2.20 ఎకరాలు ఉంది. అలాగే సర్వేనెంబరు 163లో 10 సెంట్ల చొప్పున 20 సెంట్లు ఉంది. మొత్తం 2.40 ఎకరాలలో 91 సెంట్లు తగ్గిపోయింది. వీరూ వెనుకబడిన వర్గాలకు చెందిన వారే.
- పూజల రామాంజనేయులు తండ్రి శేషగిరిరావు (80) సర్వే నెంబరు 127లో ఒక ఎకరం ఉండగా 43 సెంట్లు మాత్రమే ఉందని నాటి ప్రభుత్వం లెక్కతేలి్చంది. సర్వేనెంబరు 160లో 1.10 ఎకరాలకు గాను 1.08 ఎకరాలు ఉందని చెప్పింది. మొత్తానికి 59 సెంట్లు లేదని దబాయించింది. బీసీలమైన తమకు అన్యాయం జరిగిందని రెండేళ్లు తిరిగినా పట్టించుకోలేదు సరికదా తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని బెదిరించడంతో చేసేది లేక మిన్నకున్నారు. ప్రభుత్వం మారిన తరువాత తుళ్లూరు తహసీల్దార్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 82/2020 కింద కేసు నమోదైంది.
- గుమ్మా సీతారావమ్మ (80)కు సర్వే నెంబరు 133లో ఒక ఎకరం ఉండగా 82 సెంట్లు, 160 సి లో 56 సెంట్లకు గాను 50 సెంట్లు, 166లో 3.13 ఎకరాలకు గాను 3.11 ఎకరాలు ఉన్నట్లు లెక్కతేల్చారు. మొత్తంగా 26 సెంట్లు తగ్గించి చూపారు. పూలింగ్‌లో భూమి విస్తీర్ణం తగ్గించేశారనే మనోవేదనతో తన తల్లి గుండె ఆగిందని గుమ్మా వెంకట్రావు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ వర్గానికి చెందిన తమకు ఎవరి నుంచి కనీస మాట సాయం కూడా దక్కలేదన్నారు.
- మాడపాటి వీరరాఘవయ్య 2005లో నెక్కల్లుకు చెందిన రైతు నుంచి 1.10 ఎకరాలను కొనుగోలుచేయగా 96 సెంట్లు మాత్రమే ఉందని సర్వేలో తేల్చారు.
- సర్వే నెంబరు 163లో 1.34 ఎకరాలు తాటి పాండురంగారావు పేరిట ఉండగా 1.08 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. గుమ్మా బుల్లిబాబు, ముప్పూరి వెంకటేశ్వరరావు, మాపూరి నరసింహారావు... ఇలా నెక్కల్లుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు చెందిన 30 కుటుంబాలకు పైగా భూములను కోల్పోయాయి.
ఎవరెవరికి రాసిచ్చేశారంటే..
నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ టీడీపీ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ముఖ్య అనుచరుడు. ఆయనకు నెక్కల్లు సర్వే నెంబరు 50లో 1.19 ఎకరాలు మాత్రమే ఉంది. దీని ఖాతా నెంబరు 741. కానీ ఈ ఖాతా నెంబరులో 3.11 ఎకరాలు అదనంగా చూపారు. ఈ 3.11 ఎకరాలు తమ భూముల్లో తగ్గించేసి గోపాలకృష్ణ పేరిట చేర్చారని బీసీ వర్గాల ఆరోపణ. ఈ భూమిని 9.14 జీవో కింద పూలింగ్‌కు ఇచ్చి 4,300 చదరపు గజాలు పొందారు. ఇందులో 8 ప్లాట్లు నివాసం, రెండు ప్లాట్లు కమర్షియల్ కింద లాటరీ ద్వారా దక్కాయి. (సీఆర్‌డీఏ ప్లాట్ల కేటాయింపు వివరాలు డాక్యుమెంటు 5657/2018 లో స్పష్టంగా ఉంది). ఇందులో అయిదు ప్లాట్లను ఇప్పటికే రావెల విక్రయించేశారు. ఈ భూమికి మూడేళ్లుగా కౌలు కూడా పొందారు.
రావెల అనుచరులు, ఆయన సామాజిక వర్గానికే చెందిన రామినేని మల్లేశ్వరి 1.14 ఎకరాలు, రామినేని సుబ్బారావు– 1.25 ఎకరాలు, రామినేని మురళి– 50 సెంట్లు, కాకా రాఘవయ్య– 1.20 ఎకరాలు, వై.వెంకట్రావు 50 సెంట్లు పొందారు. వెరసి 4.59 ఎకరాల పేదల భూమిని ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు చేజిక్కించుకున్నారు. కాగా రాఘవయ్య గోపాలకృష్ణకు మేనమామ కావడం గమనార్హం. 9.14 జీవో ద్వారా సీఆర్‌డీఏ కి పూలింగ్‌లో ఇచ్చి కౌలు పొందుతున్నారు. ఇవన్నీ పూర్వపు సీఆర్‌డీఏ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment