![AP High Court Orders On BJP Leader Petition - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/24/HIGH-COURT-2_0.jpg.webp?itok=AmXk7-df)
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రైవేట్ సంప్రదింపుల ద్వారా చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను, ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీని నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం నవరత్నాల కింద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి సంప్రదింపుల ద్వారా భూమిని సేకరించడం చట్టవిరుద్ధమంటూ బీజేపీ నేత సాగి విశ్వనాథరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 25న ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ కోర్టుకు నివేదించారు.
ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ప్రభుత్వ చర్యల ద్వారా సదరు భూ యజమాని ప్రభావితమై.. అతను కోర్టుని ఆశ్రయిస్తే, అప్పుడు జోక్యం చేసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన భూ సేకరణ ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తెలిపింది. భూ సేకరణ ప్రక్రియ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను జనవరి 22కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment