సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు.
రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు.
యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను
మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు.
భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్‌రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్‌రెడ్డికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment