సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత, పేచీల కారణంగా ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వేగంగా అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు కాలదోషం పట్టి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి ఆఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులు సందిగ్ధంలో పడ్డాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రాజెక్టుకు మరింత జాప్యం తప్పదు. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరేదాకా ఎదురుచూడక తప్పదు.
అనుమతులకు దరఖాస్తే చేయలేదు
పెద్ద రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కీలకం. అనుమతులొచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతమాల పరియోజన–1లో కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని చేర్చింది. అలైన్‌మెంట్‌కు అనుమతులు రావటంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గత ఏడాదే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తినా ఎలాగోలా సభలను పూర్తిచేశారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు ఈ రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది.
భూపరిహార వాటా నిధులు అందనందుకే..
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పరిహారంలో రాష్ట్రప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా రూ.2,600 కోట్లు అవుతుందని తాత్కాలికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్‌హెచ్‌ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలివిడతగా కనీసం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచి్చంది. కానీ నిధుల విడుదల కాలేదు. ఇలా నిధులు రాకుండా, అవార్డులు పాస్ చేయటం సరికాదని, ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేంద్రం రీజనల్ రింగ్‌రోడ్డు పనిని పక్కన పెట్టేసింది. జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కీలక ప్రాజెక్టు కాస్తా పెండింగ్‌లో పడింది.
నిధుల పేచీతో నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్’!
Published Mon, Jan 29 2024 5:00 AM | Last Updated on Mon, Jan 29 2024 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment