రాజస్తాన్‌లోని ఝలావార్‌లో రాహుల్ యాత్ర
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు.
రాజస్తాన్‌లోకి జోడో యాత్ర
మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment