![Bharat Jodo Yatra: India Facing Highest Unemployment Rate In 45 Years says Rahul Gandhi - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/17/RG1.jpg.webp?itok=8CTt27B1)
కేరళలోని కొల్లంలో రాహుల్‌ను ముద్దాడుతున్న అభిమాని
కొల్లం: దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, గత 45 ఏళ్లలో రికార్డు స్థాయికి నిరుద్యోగం రేటు చేరుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పి వారి భవిష్యత్‌ను బలోపేతం చేయాలన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తొమ్మిదో రోజు కొల్లామ్ జిల్లా పొలయతోడు నుంచి కరునాగపల్లి వరకు సాగింది.
తన పాదయాత్ర విశేషాలను ఫేస్‌బుక్‌లో పంచుకున్న రాహుల్ గాంధీ తాను ఎంతో మంది యువతీ యువకుల్ని కలుసుకున్నానని, ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నానని వెల్లడించారు. యువ శక్తిని భారత్ సద్వినియోగం చేసుకుంటే దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘ఇప్పుడు యువత ఉద్యోగాలు దొరక్క తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. 45 ఏళ్లలో నిరుద్యోగం రేటు అత్యధిక స్థాయికి చేరుకుంది. యువతలో నిరాశను పోగొట్టి భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే’’ అని రాహుల్ అన్నారు.
స్కూలు విద్యార్థులతో మాట మంతీ
రాహుల్ పాదయాత్రను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. సీనియర్ సిటిజన్లు సెక్యూరిటీని దాటుకొని కరచాలనానికి, సెల్ఫీలకు ప్రయత్నించారు. ఒక కథాకళి డ్యాన్సర్ నాట్యం చేయడంతో రాహుల్ ఆసక్తిగా చూశారు. నీన్‌దకరలోని ఒక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఫోటోలు దిగారు. ‘‘కేరళ అందాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక్కడి ప్రజలు రాష్ట్రానికి మరింత అందం తెస్తున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment