సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియలో పక్కా విధానాన్ని అధికారులు అవలంభించనున్నారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి పరిహారమిచ్చే వరకు.. అనుసరించాల్సిన తీరుపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నాలుగు గెజిట్లు.. రెండు పత్రికా ముఖ ప్రచురణలు వెలువడనున్నాయి. ఇటీవలే భూసేకరణ అధికారుల వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఇలా ఉంటుంది...
3ఎ: భూసేకరణ కోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలతో కాంపిటెంట్ అథారిటీని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వివరాలను ఎన్‌హెచ్ ఏఐకి పంపింది. మరోవారంలోపు తొలి గెజిట్ విడుదల కానుంది. దాన్నే 3ఏ (స్మాల్ ఆల్ఫా బెట్)గా పిలుస్తారు. ప్రాజెక్టు పేరు, ఆ రోడ్డు ఏయే మండలాల నుంచి నిర్మాణం కానుంది.. గ్రామాల పేర్లు, సర్వే నంబర్లు.. ఆ ప్రాంతాల భూసేకరణ అధికారులుగా వ్యవహరించేవారి వివరాలను తెలుపుతూ తొలి గెజిట్ విడుదల కానుంది.
3ఏ (కేపిటల్ ఆల్ఫాబెట్): ఇది రెండో గెజిట్. ఇందులో ఆ గ్రామాలు, సర్వే నంబర్లతోపాటు సేకరించాల్సిన భూ విస్తీర్ణం వివరాలను పొందుపరిచి విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలకు 21 రోజుల గడువిస్తారు.
3సీ: పై గెజిట్‌లోని అభ్యంతరాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభ ఏర్పాటుకు ఈ గెజిట్ విడుదల చేస్తారు. ఈ సభలో ఆ అభ్యంతరాలను చదివి సమాధానాలిస్తారు. సానుకూలమైన వాటిని పరిష్కరించి.. వ్యతిరేకంగా ఉన్నవాటిని తోసిపుచ్చుతారు. అనంతరం రెవెన్యూ అధికారులు సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి. దీనికీ ఈ సభలోనే రైతుల నుంచి అనుమతి పొందుతారు. తదుపరి అధికారుల క్షేత్ర పర్యటనలో ఎవరైనా అడ్డుకుంటే పోలీసు శాఖ ద్వారా చర్య తీసుకుంటారు.
3డీ: ఇది కీలక గెజిట్. గ్రామాలు, సర్వే నంబర్లు, వాటి యజమానులు, ఒక్కొక్కరికి ఉన్న భూ విస్తీర్ణం తదితర సమస్త వివరాలు ఇందులో పొందుపరిచి విడుదల చేస్తారు.
3జీ: ఇది పత్రికాముఖంగా వెలువడే ప్రకటన. సమీకరించాల్సిన భూమిలోని నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తుల వివరాలను ఈ ప్రకటన ద్వారా వెలువరిస్తారు. వాటికీ పరిహారం అందుతుంది. దీనిపై కూడా అభ్యంతరాలుంటే చెప్పుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. తమ స్థలంలో పరిహారం పొందాల్సిన అంశాలను తక్కువగా చూపారనే తరహా అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి.
3హెచ్: ఇది కూడా పత్రికా ముఖంగా వెలువడే ప్రకటన. ఇందులో భూ యజమానులు పొందే పరిహారం ఎంతో వెల్లడిస్తారు. యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తారు. వారికి వారి బ్యాంకుల్లో ఆ మొత్తాన్ని జమచేస్తారు. పరిహారం విషయంలో సంతృప్తి లేనివారు దాన్ని తీసుకోని పక్షంలో, కోర్టుతో రెవెన్యూ విభాగం ప్రత్యేకంగా తెరిచే జాయింట్ ఖాతాలో ఆ మొత్తాన్ని ఉంచుతారు. పరిహారంపై అభ్యంతరాలను అధికారులు, కోర్టు ద్వారా తేల్చుకున్న తర్వాత ఆ మొత్తాన్ని వారు తీసుకుంటారు.
పరిహారం ఇలా నిర్ధారిస్తారు
మూడేళ్లుగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన మూడు గరిష్ట మొత్తాలను (సంవత్సరానికి ఒకటి చొప్పున) తీసుకుంటారు. వీటి సగటును లెక్కిస్తారు. దీనికి నిర్ధారిత మల్టీపుల్ ఫ్యాక్టర్‌తో గుణిస్తారు. ఇది ఆయా పరిస్థితుల ఆధారంగా గుర్తించి ఉంటుంది. అది 1.5గా ఉంటుంది. ఆ వచ్చే మొత్తాన్ని సొలీషియమ్ పేరుతో రెట్టింపు చేస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని.. గెజిట్ విడుదలైనప్పటి నుంచి 12% వడ్డీ లెక్కించి జత చేసి ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment