ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం | Telangana to expedite Regional Ring Road works | Sakshi
Sakshi News home page

ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం

Published Thu, Jan 18 2024 6:06 AM | Last Updated on Thu, Jan 18 2024 6:06 AM

Telangana to expedite Regional Ring Road works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్‌ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్‌) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి లేఖ ఇచ్చింది.

దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్‌కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.  

ఇక అవార్డ్‌ జారీకి శ్రీకారం: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్‌ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్‌ జారీచేసే కసరత్తుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్‌ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్‌ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్‌హెచ్‌ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్‌ రింగ్‌రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి.

దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్‌మాల పరియోజన తదుపరి ఫేజ్‌లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు.  

ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. 
భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్‌ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్‌ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్‌హెచ్‌ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్‌ నో టిఫికేషన్‌ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్‌లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement