సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో వెలుగులోకి రాని అనేక వ్యవహారాలున్నట్టు సీఐడీ అనుమానిస్తోంది. ఇన్నాళ్లు సాగిన దర్యాప్తులో కేవలం 40శాతం మాత్రమే ఆస్తులను గుర్తించినట్టు భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ కోసం అగ్రిగోల్డ్ బాధ్యులు 80కి పైగా బినామీ కంపెనీలను సృష్టించినట్టు అనుమానిస్తోంది.
సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు విచారణలో ఒక్కొక్కటిగా కంపెనీల గుట్టుతోపాటు ఆ కంపెనీల పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులు వెలుగులోకి వస్తున్నట్టు తెలిసింది. భారీస్థాయిలో భూములు కూడబెట్టేందుకు అగ్రిగోల్డ్ బినామీ కంపెనీలను సృష్టించడంతోపాటు కొన్ని కంపెనీలను ఉపయోగించుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఒక్కో కంపెనీకి దాని ఆదాయ పరిమితిని బట్టి భూములు కొనొచ్చు. అయితే అగ్రిగోల్డ్‌లోని చాలా కంపెనీలు 53 ఎకరాల వరకు కొనుగోలు చేసి వాటిని ట్రేడింగ్ చేసే అవకాశం ఉన్నట్టు సీఐడీ గుర్తించింది. ఇలా దేశవ్యాప్తంగా 25వేల ఎకరాలకు పైగా కొనుగోలుచేసి ఉంటుందని సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
బినామీ కంపెనీల గుర్తింపులో...
తెలంగాణ సీఐడీ చేస్తున్న దర్యాప్తులో మొన్నటి వరకు బినామీ కంపెనీలపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో వేల ఎకరాలు చేతులు మారినట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. బినామీ కంపెనీల్లో ఉన్న డైరెక్టర్లను గుర్తించకపోవడం, ఆ కంపెనీల పేర్ల మీద ఉన్న ఆస్తులను అటాచ్ చేయకపోవడం అగ్రిగోల్డ్ పెద్దలకు కలిసి వచ్చినట్టు భావిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఆదేశాలిచ్చాయి. అటాచ్ చేసిన భూములు, ఇళ్ల సర్వే నంబర్లను రిజిస్ట్రేషన్ విభాగానికి పంపించి సంబంధిత ఆస్తులను నిషేధిత జాబితాలో పొందుపరిచారు.
ఎవరైనా ఈ ఆస్తుల క్రయవిక్రయాలు చేస్తే ఆయా సబ్ రిజిస్ట్రార్‌ల సర్వర్‌లో నిషేధిత భూములని కనిపిస్తుంది. దీంతో అమ్మకానికి అవకాశం ఉండదు. కానీ బినామీ కంపెనీల పేరిట ఉన్న ఆస్తులను గుర్తించకపోవడంతో అటాచ్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో అగ్రిగోల్డ్ బాధ్యుల్లో కొందరు ప్రభుత్వంలో పలుకుబడి కల్గిన వ్యక్తులతో చేతులు కలిపి బినామీ భూముల క్రయవిక్రయాలు జరిపినట్లు సీఐడీ గుర్తించింది. అందులో ప్రధానంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన 76 ఎకరాల భూమి అమ్మకం బయటకు రావడంతో ఇప్పుడు బినామీ కంపెనీలను గుర్తించే పనిలో సీఐడీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఎవరి పాత్ర ఎంత?
అగ్రిగోల్డ్‌లో కీలక బాధ్యులుగా ఉన్న నలుగురిని సీఐడీ అనుమానిస్తోంది. బినామీ ఆస్తులను బయట వ్యక్తుల ద్వారా తక్కువ ధరకు కొనిపించి, మళ్లీ ఆ భూములను మార్కెట్ రేట్ లెక్కన తమ సంబంధీకులకు అమ్మేలా కుట్రపన్నినట్టు గుర్తించింది. అయితే బినామీ కంపెనీల్లో డైరెక్టర్లతో పాటు అగ్రిగోల్డ్ కీలక వ్యక్తుల పాత్రపై ఇప్పుడు లోతుగా విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. భూములమ్మిన, కొనుగోలు చేసిన వారికి ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో నిరూపించే పనిలో సీఐడీ ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment