![Chandrababu irregularities in land acquisition in the name of capital - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/fake.jpg.webp?itok=V4JMb0iM)
భ్రమలు తొలగిపోయాయని అక్కసు
రాజధాని పేరిట భూసేకరణలో చంద్రబాబు అక్రమాలు
అవసరానికి మించి బలవంతంగా భూసేకరణ
రైతుల ఆక్రందనకు విలువ ఇవ్వని ఈనాడు
అన్నదాతల సమస్యలకు జగన్ ప్రభుత్వం పరిష్కారం
625.25 ఎకరాల భూములు రైతులకు వాపస్
అది తప్పంటూ రామోజీ కుట్రపూరిత రాతలు
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు.
అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు.
వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్‌లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్‌డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్‌డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు.
కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి.
ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు
వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్‌లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు.
కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్‌డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సీఆర్‌డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్‌ను అందుబాటులో ఉంచారు. గెజిట్‌కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు.
ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్‌లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి
వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది.
ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బందులు వస్తాయి
వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు.
Comments
Please login to add a commentAdd a comment