ఆడబిడ్డల గోడు పట్టదా? | Gouravelli oustees on the edge as project nears completion | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డల గోడు పట్టదా?

Published Sat, Mar 4 2023 2:33 AM | Last Updated on Sat, Mar 4 2023 8:30 AM

Gouravelli oustees on the edge as project nears completion - Sakshi

హుస్నాబాద్‌:  ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

రూ.6 లక్షలు, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తామని.. 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది.

ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్‌గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్‌ పెంచుతూ పోయారు.

ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్‌ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.  

జాబితా నుంచి తొలగింపు 
మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్‌ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు.  

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు 
అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్‌ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్‌ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 24న హుస్నాబాద్‌ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్‌రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్‌ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు.  

ఇదేం న్యాయం? 
మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం?   – చుంచు రాణి, నిర్వాసితురాలు 

వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా?  
గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం.  – భూక్య శిరీష, నిర్వాసితురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement