కూకట్‌పల్లిలో 340 ఎకరాల భూకబ్జాకు పూర్తి సహకారం
సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్‌పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ ధైర్యం చేసి సైబరాబాద్ పోలీస్‌కమిషనర్ అవినాష్ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్‌అలీఖాన్ తండ్రి నవాబ్ మీర్ హషిమ్ అలీఖాన్‌కు వారసత్వంగా వచి్చంది.
దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్ సూట్ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్ వీటి కోసం ఎస్‌ఎస్.మొయినుద్దీన్, యాసీన్ షేక్ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్.. వీరిద్దరిపై కేపీహెచ్‌బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్ కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్ చేశాడు. దీంతో కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హషిమ్‌అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.
ఈ క్రమంలోనే గ్రీన్‌కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్‌తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్‌ను కిడ్నాప్ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్ 30న కన్నుమూశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్ అలీఖాన్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment