సాక్షి, హైదరాబాద్: ‘చావునైనా భరిస్తాను తప్ప ఆత్మగౌరవాన్ని కోల్పోను. ప్రజలను, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న వాడు చెడిపోడు. ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజం వెంట నిలుస్తా..’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల సోమవారం దేవరయాంజాల్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ ప్రేమకే తప్ప ఇలాంటి చర్యలకు లొంగడు. కేసులు పెట్టి జైలుకు పంపితే వెళ్తా. నా వ్యాపారాన్ని మూసి వేస్తావేమో. కట్టుబట్టలతో వచ్చా, మళ్లీ ఆ స్థాయికి వెళ్లేందుకు సిద్ధపడతా తప్ప నా ఆత్మను అమ్ముకునే ప్రయత్నం చేయను. మీకున్న అధికారంతో నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. కారు గుర్తు మీద గెలిచావ్ కదా.. రాజీనామా చేయాలని మీరు అంటారు. కానీ హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఆరుసార్లు ఎమ్మెల్యేనయ్యా. రాజీనామా చేసే ముందు నన్ను 20 ఏండ్లుగా ఎత్తుకుని ప్రేమించిన హుజూరాబాద్ ప్రజల సలహాలు, సూచనలు, ఆశీర్వాదం తీసుకుని నిర్ణయం తీసుకుంటా’అని ఈటల అన్నారు. చదవండి: (తెలంగాణ కాంగ్రెస్ సారథి ఎవరు?)
తెలంగాణ బిడ్డలను మెప్పించలేరు
‘నేను పదవుల కోసం పెదవులు మూసుకునే రకం కాదు. మీ శిష్యరికంలోనే టీఆర్‌ఎస్ గులాబీ జెండా కింద ఈ స్థాయికి వచ్చినం. రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులం అవుతమని మీ వెంట రాలేదు. ఒక లక్ష్యం కోసం ఉద్యమ స్వభావంతో మీ వెంట నడిచినం. మా వ్యాపారం, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలో పనిచేశాం. 19 ఏండ్లు నీతో ఉన్న మేము ఒక్కసారి దెయ్యం ఎలా అయ్యాం. పార్టీ పెడతామని, మారతామని ఏ ఒక్కరికీ చెప్పలేదు. ఉద్యమ నాయకుడిగా, మంత్రిగా.. ఎన్నడూ కేసీఆర్‌కు, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఈటల రాజేందర్ లాంటి మామూలు మనిషి మీద మీ శక్తిని ప్రయోగించడం మీ గౌరవాన్ని, స్థాయిని పెంచదు. ఈ విషయంలో మీరు తెలంగాణ బిడ్డలను మెప్పించలేరు..’అని రాజేందర్ పేర్కొన్నారు.
సర్దుకుపోని వారిని మీరు ఎలా ఖతం చేస్తారో తెలుసు
నేను ఒక్కడినే కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాకు సానుభూతి తెలపకపోవచ్చు. నాది ఆత్మ గౌరవ సమస్య. నేను ఎందుకు దూరమయ్యానో మీ అంతరాత్మకు తెలుసు. మంత్రిగా చూడకపోయినా మనిషిగా చూడాలని కోరుకున్నాం. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవంగా ఉన్నట్లు అనుకోవడం లేదు. మీతో సర్దుకుపోని వారిని చట్టాలు, వ్యవస్థను పక్కన పెట్టి మీరు ఎలా ఖతం చేస్తారో తెలుసు. నా మొత్తం సంపాదన, వ్యాపారం, ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి..’అని ఈటల డిమాండ్ చేశారు. చదవండి: ('పుర' పీఠాలపై గులాబీ జెండా)
నోటీసులు ఇవ్వలేదు.. వివరణ కోరలేదు
‘నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో భయానక వాతావరణం సృష్టించి భూములు కొలవడం ఎంతవరకు సమంజసం? మీ అధికారులు వావి వరుసలు మరిచి నివేదికలు ఇచ్చారు. కనీసం మా వివరణ కూడా అడగలేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా దోషిగా నిరూపిస్తే శిక్షకు సిద్ధం. మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు వేసేటప్పుడు భూములు తీసుకుని ఉంటారు కదా. అందులోనూ అస్సైన్డ్ భూములున్నాయి. మీరు మీ భూములను కొన్నప్పుడు రెండు మూడు లక్షలకు కొన్నారు. ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. నేను అలానే కొన్నాను. ఇప్పుడు వాటి విలువ పెరిగితే.. కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయంటారా..? దేవరయాంజాల్‌లో ఆరు ఎకరాలు కొన్నా. అవి దేవాలయాల భూములంటున్నారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి టీకే దివాన్ కమిటీని నియమించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల దృష్టికీ, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దృష్టికి కూడా ఈ విషయం తీసుకువచ్చా. ఇప్పుడే ఎందుకులే అని పెండింగ్‌లో పెట్టారు. నా ఒక్కడి కోసం వందలాది మంది రైతులకు అన్యాయం చేయొద్దు..’అని ఈటల అన్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో బియ్యం కొనుగోలుపై తనపై ఆరోపణలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment