సాక్షి, కరీంనగర్: భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌పై పోరుకే సిద్ధమవుతున్నారా? సొంత పార్టీ పెట్టబోతున్నారా? హుజూరాబాద్ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తన వర్గీయులు, సన్నిహితులతో కొద్దిరోజులుగా చర్చలు జరిపిన ఈటల అధికార పార్టీపై పోరాటం సాగించాలన్న నిర్ణయానికే వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులలో మెజారిటీ నాయకులు ఇప్పటికే ఆయనకు మద్దతు తెలుపగా, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఉమతోపాటు నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా సంఘీభావం ప్రకటించారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే.. ఈటల మాత్రం ఏ పార్టీలో చేరకుండా సొంతంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికే వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. తన అనుయాయులు, స్నేహితులు, గతంలో ఉద్యమంలో కలిసి పనిచేసిన వారు కూడా సొంత పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరు సాగించాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా టీఆర్‌ఎస్ పార్టీని, ప్రభుత్వ విధానాలను, నేతల వైఖరిని తూర్పార పడుతూ ఓ పాటను ఈటల వర్గం విడుదల చేయడం గమనార్హం. చదవండి: (తెలంగాణలో లాక్‌డౌన్?.. 15వ తేదీ నుంచి అమల్లోకి..!)
యుద్ధం ఇక మొదలయిందంటూ..
‘యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలరా.. సిద్ధమయి ఇక ఆత్మగౌరవ పోరు సల్పుదామా.. ఈటల రాజన్నతో ఇక జెండలెత్తుదామా.. దగాకోరుల దౌర్జన్యాన్ని గద్దె దించుదామా..’అంటూ సాగిన ఈ పాటను మానుకోట ప్రసాద్ రాయగా, రాంబాబు పాడాడు. ఈటల పట్ల ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన వైఖరిని తప్పు పడుతూ రాగయుక్తంగా ధ్వజమెత్తారు. ‘అవసరానికి వాడుకున్నమని విర్రవీగుతుండ్రు.. ఆ స్వరం సైరన్‌కూత మీరిక తట్టుకోరు సూడూ.. గుండెలు మండే మోసం చేస్తిరి కాసుకోండి మీరూ..’ అంటూ సాగిన ఈ పాటలో ‘ఎత్తుతున్నమూ ఈటలన్నతో పోరు జెండ మేము’అంటూ పరోక్షంగా పార్టీ పెట్టనున్న విషయాన్నీ తెలియజేశారు.
భారీ బహిరంగ సభకు సమాలోచనలు
ఆత్మగౌరవ పోరాటం నినాదంతో హుజూరాబాద్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయడం ద్వా రా టీఆర్‌ఎస్‌పై పోరాటానికి నాంది పలకాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. అదే సభా వేది క పైనుంచి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటన చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment