సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ శరవేగంగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్లతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఎస్‌ఈలతో ఎప్పటికప్పుడు భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భూ సేకరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మొత్తం తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో 10 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఆరు వేల ఎకరాల పరిధిలో డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మిగిలిన భూమి సర్వే దశలో ఉంది. మూడు, నాలుగు నెలల్లోనే భూ సేకరణ తంతు పూర్తి కానుంది.
జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రూ. 1357 కోట్లతో రాజోలి రిజర్వాయర్, రూ. 852.59 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె చెరువులను విస్తరించి వాటి పరిధిలోని పలు చెరువుల ద్వారా‡ వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు రూ. 45.49 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, రూ. 1100 కోట్లతో పీబీసీ, జీకేఎల్‌ఐల పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ. 3050 కోట్లతో గండికోట, సీబీఆర్ లిఫ్ట్ అలాగే గండికోట, పైడిపాలెం లిఫ్ట్ పనులు రూ. 1182 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ పనులను చేపట్టారు. ఇది కాకుండా రూ. 50 కోట్ల నిధులతో బ్రహ్మంసాగర్ పరిధిలోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులు, తెలుగుగంగ పరిధిలోని ఎస్‌ఆర్–1లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నారు.
810,245.02 ఎకరాల భూ సేకరణ
తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో మొత్తం 10,245.02 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 6076.02 ఎకరాల భూమికి డిక్లరేషన్ అవార్డు అయింది. మరో 9571.38 ఎకరాలు ప్రతిపాదనల దశలో ఉండగా, 3552 ఎకరాల భూమి సర్వే దశలో ఉంది. ఇది కాకుండా వైఎస్సార్ జిల్లాలో 1080 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 390 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 72 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తికానుంది.
త్వరలోనే భూ సేకరణ పూర్తి
భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొత్తం 10,245.02 ఎకరాల భూమిని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 65 శాతం మేర భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానుంది.
– రామ్మోహన్, స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ), జీఎన్‌ఎస్‌ఎస్, కడప
వేగవంతంగా భూ సేకరణ
జీఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని అన్ని కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 65 శాతానికి భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, ఆయా ప్రాజెక్టుల స్పెషల్ కలెక్టర్ భూ సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది.
– మల్లికార్జునరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీరు, జీఎన్‌ఎస్‌ఎస్, కడప
Comments
Please login to add a commentAdd a comment