
స్పందన కార్యక్రమంలో వినతి ఇవ్వగానే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో సూచిస్తూ రశీదు ఇస్తాం. ఇది కంప్యూటర్‌లో రెడ్ ఫ్లాగ్‌తో వెళ్లాలి. సమస్య పరిష్కారమయ్యాక ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి సమస్య తీరిందని అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. ఇలా చేయకపోతే అకౌంటబులిటీ లేనట్టే. ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా ఉండేట్లు చూడాలి. దీనివల్ల వినతులు ఇచ్చేవారు సంతృప్తి చెందుతారు.
ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్టు సమాచారం వస్తోంది. వీటిపై వివరాలు తెప్పించుకుని కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో సంబంధిత జిల్లాల ఎస్పీలు గట్టి సంకేతాలు పంపించాల్సిన అవసరం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పవర్ కట్స్‌పై.. కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో తాగునీటి సమస్యపై ఎక్కువగా ప్రజలు స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నామని, అదే సమయంలో ఎవరి ఉసురూ మనకు తగలకూడదని చెప్పారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సమీక్షిస్తూ.. కలెక్టర్లు ఉదారంగా ఉండాలని సూచించారు. పలానా కలెక్టర్ అన్యాయంగా భూములను తీసుకున్నారనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వివిధ జిల్లాలకు సీఎస్ సహా సీఎం కార్యాలయ ఉన్నతాధికారులను నియమించామని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో ఏ సహాయం కావాలన్నా జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులను సంప్రదించాలని సీఎం సూచించారు.
భూములను పొజిషన్‌లోకి తీసుకోవాలి
మార్చి 1 నాటికి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్న భూములను పొజిషన్‌లోకి తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వీలైనంత త్వరగా భూమిని సమీకరించుకోవాలన్నారు. ప్లాట్లు మార్కింగ్ చేసి ఉంటే, వెంటనే లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని, ఉగాది రోజు మార్చి 25న పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మనకు నెల రోజులు మాత్రమే సమయం ఉందని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయకపోతే లక్ష్యాన్ని చేరుకోలేమని అన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూములను వెంటనే అభివృద్ధి చేసి ప్లాట్లు డెవలప్ చేయాలని చెప్పారు.
స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
వినతులపై నిరంతర పర్యవేక్షణ
స్పందన విజయవంతం కావాలంటే అక్కడ వచ్చే సమస్యలను కలెక్టర్లు నిరంతరం కచ్చితంగా పర్యవేక్షించడంతో పాటు వాటిని సకాలంలో పరిష్కరించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే వినతులపై జిల్లా కలెక్టర్లు, ప్రతి శాఖ కార్యదర్శి పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా వచ్చే వినతులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నకిలీ మద్యం, శాంతి భద్రతలపై వచ్చే వినతులను స్థానిక ఎస్పీతో పాటు డీజీపీకి పంపించాలన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు లాంటి అంశాలు ఉన్నప్పుడు స్థానిక ఎస్పీకి, డీజీపీకి, వీటిని నిరోధించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలకు పంపాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయం నుంచి వచ్చే వినతులను రెడ్ ఫ్లాగ్‌తో.. స్పందించిన తర్వాత తిరిగి గ్రీన్ ఫ్లాగ్‌తో పంపించాలని ఆదేశించారు. వినతులను పంపించాక కలెక్టర్లు, కార్యదర్శులు, డీజీపీతో పాటు సంబంధిత అధికారులకు అలర్ట్స్ ఇవ్వాలని చెప్పారు. వచ్చే స్పందన నాటికి ఈ ఏర్పాట్లు ఉండాలని, స్పందన కార్యక్రమం మరో స్థాయిలోకి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.
హౌస్ హోల్డ్స్ సర్వే, మ్యాపింగ్ పూర్తి చేయాలి
హౌస్ హోల్డ్స్ సర్వే, మ్యాపింగ్ వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రతి వలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్‌ను మ్యాపింగ్ చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అటెండెన్స్ తప్పనిసరి చేయాలని, వలంటీర్లు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పేలా ఏదో ఒక సమయంలో హాజరు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని సూచించారు. తనకు అప్పగించిన 50 కుటుంబాల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా తెలుసుకునే అవకాశం ఉండాలన్నారు.
పెన్షన్లు, బియ్యం కార్డుల రీ వెరిఫికేషన్
పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించి రీ వెరిఫికేషన్‌పై ముఖ్యమంత్రి సమీక్షించారు. రీ వెరిఫికేషన్ చేసిన తర్వాత జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. పెన్షన్లకు సంబంధించి ఖరారు చేసిన జాబితాలను రేపటి (బుధవారం) నుంచి పర్మినెంట్‌గా అందుబాటులో ఉంచుతామని సెర్ప్ అధికారులు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో బియ్యం కార్డుల రీ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితాలను సచివాలయాల్లో ఉంచుతామన్నారు. అదనపు లబ్ధిదారులకు 1వ తేదీ నుంచి కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయాలని, రీ వెరిఫై అయ్యాక పెన్షన్లు, బియ్యం కార్డుల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా ఉంచాలని సీఎం ఆదేశించారు.
బెల్టు షాపులు, అక్రమ మద్యంపై గట్టిగా వ్యవహరించాలి
ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు, మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని, వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. బెల్టు షాపులు, అక్రమ మద్యం తయారీ, ఇంకా ఏదైనా జరిగితే.. మహిళా పోలీసుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని ఎస్పీలు గట్టిగా చాటి చెప్పాలని సూచించారు. మనం వీటిని నియంత్రించడానికి గట్టి చట్టాన్ని తీసుకొచ్చామని, దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. ‘బెల్టుషాపులు నిర్వహించే వారికి, అక్రమ మద్యం తయారు చేసే వారికి భయం రావాలి.
మహిళా పోలీసుల నుంచి కాల్స్ ఎస్పీలకే కాదు.. ప్రత్యేక బృందాలకూ వెళ్తాయి. గ్రామ సచివాలయాలు, మహిళా పోలీసులు, మహిళా మిత్రల వ్యవస్థలను ఎస్పీలు ఓనర్‌షిప్ తీసుకోవాలి’ అని సీఎం సూచించారు. చిత్తూరు జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య ఘటన విషయంలో వెంటనే తీర్పు వచ్చిన విషయాన్ని డీజీపీ సవాంగ్ ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. పోలీసులు శరవేగంగా పనిచేసి చార్జిషీటు వేశారని, ఆధారాలను కోర్టు ముందు ఉంచారన్నారు. దీనిపై చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ను సీఎం అభినందించారు. దిశ పోలీస్‌స్టేషన్ల ప్రగతిపై ఎస్పీలతో సమీక్షిస్తూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment