అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం | AP CM YS Jagan Immediate action About Paddy Procurement | Sakshi
Sakshi News home page

అన్నదాతకు భరోసా.. తక్షణమే ఆదుకోవాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

Published Sun, May 7 2023 4:56 AM | Last Updated on Sun, May 7 2023 10:35 AM

AP CM YS Jagan Immediate action About Paddy Procurement - Sakshi

కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే వేళ కురుస్తున్న అకాల వర్షాలతో అన్న­దాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీ­లకంగా వ్యవహరిస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదే­శాల మేరకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. ప్రచారా­నికి దూరంగా, పనికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టా­ల్సిన చర్యలన్నీ వెనువెంటనే తీసుకుంటూ ధాన్యం కొనుగోలుకు ఉపక్రమించి, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వమే గన్నీ సంచులు, లేబర్, రవాణా చార్జీల కోసం నిధులు విడుదల చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేసి ఆదుకుంటోంది.

ఈ వాస్తవాలను స్థానికంగా రైతులు నిర్ధారిస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే అబద్ధాలతో కూడిన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రచారం కోసం పాకులాడుతున్నారు. ఆయన హయాంలో గన్నీ సంచుల కోసం, రవాణా కోసం, లేబర్‌ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోలేదు. ఈ విషయాన్ని దాచిపెట్టి.. ‘నేనొచ్చే వరకు గోతాలకూ దిక్కులేద’ని రైతులను రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత సహాయ కార్యక్రమాల్లో గత చంద్రబాబు ప్రభుత్వంలా ప్రచారార్భాటం లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

తక్షణ స్పందన
రాష్ట్రంలో రబీలో 54 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సకాలంలో విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సాగు వేళ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. గత రబీ కంటే మిన్నగా 86.64 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా ధాన్యం 54.23 లక్షల టన్నులు, మొక్కజొన్న 18.44 లక్షల టన్నులు, జొన్నలు 2.02 లక్షల టన్నులు వస్తాయని లెక్కలేశారు. కోతలు మొదలయ్యే సమయంలో.. దాదాపు రాష్ట్రమంతా 40 శాతం మాసూళ్లు కూడా పూర్తవని దశలో అనూహ్యంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌లోని టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూనే ఎవరు ఫోన్‌ చేసినా, క్షణాల్లో స్పందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్ధేశం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంఓ, వ్యవసాయ ఉన్నతాధికారులతో రోజువారీ సమీక్షించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులతో పాటు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామ స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం తీవ్రతను తగ్గించేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. వాట్సప్‌ గ్రూపుల ద్వారా చిన్న చిన్న వీడియో సందేశాలను పంపిస్తూ పంటను ఏ విధంగా కాపాడుకోవాలో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాకొక ఐఏఎస్‌ అధికారి
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జిల్లాకో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని నియమించగా, వారంతా గత మూడు రోజులుగా ఆయా జిల్లాల్లో మకాం వేశారు. ముంపు ప్రభావం ఉన్న గ్రామాల్లో పర్యటిçస్తూ రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పల్లెల్లో పర్యటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. కల్లాల్లోని ధాన్యం రవాణాలో సమస్య రాకుండా జిల్లాకు రూ.కోటి చొప్పున కార్పస్‌ ఫండ్‌ను విడుదల చేశారు. ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్స్‌ను ముంపు ప్రభావిత జిల్లాలకు తరలించారు. ఇప్పటికే 40–50 శాతం మేర వరి కోతలు పూర్తి కాగా, మిగిలింది పంటపై ఉంది. జొన్న, మొక్కజొన్నలు కూడా 50–60 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను మిషన్లపై కోసేలా అవగాహన కల్పిస్తున్నారు.

3 రోజుల్లో 80 వేల టన్నుల కొనుగోలు
రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 2,636 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 66 వేల మంది రైతుల నుంచి రూ.1315 కోట్ల విలువైన 6.18 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్‌ రకాలుగా గుర్తించి మద్దతు ధర కల్పిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయి పంటలో 70 శాతం సేకరించగా మిగిలింది రెండ్రోజుల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజుల్లో సుమారు 80 వేల టన్నులు సేకరించారు. 

మొలక 7–10 శాతం ఉన్నా సరే..
మార్చిలో కురిసిన వర్షాలు, ఏప్రిల్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అధిక తేమ శాతం, గింజ విరుగుడు సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల బారిన పడి బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాశులు తడిచిపోయాయి. రైతులు వాటిని ఆరబెట్టు కోలేని పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో (వాస్తవానికి పూర్తిగా ఆన్‌లైన్‌లో) కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్‌ రకంగా పరిగణించి బాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తున్నారు. సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అవసరమైన చోట్ల ఉపాధి కూలీలతో పంట పొలాల్లో నిలిచిపోయిన ముంపు నీరు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తేమ, నూక శాతం తగ్గించేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నూర్పిడులు పూర్తిగా మిషన్లపై చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 

మండలానికో మినీ మొబైల్‌ మిల్లు
నూక శాతం పేరుతో మిల్లర్లు రైతులను దోపిడీ చేయకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మండలానికి ఒకటి చొప్పున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, గోదావరి జిల్లాల్లో మొబైల్‌ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు, రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ క్యాడర్‌ అధికారులను కస్టోడియన్‌ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా చూస్తున్నారు. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లనవసరం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఏ మిల్లర్‌ అయినా íపిలిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందిపెట్టిన కారణంగా ఇప్పటికే 39 రైస్‌ మిల్లులపై చర్యలు తీసుకున్నారు.

రంగంలోకి మార్క్‌ఫెడ్‌
వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న మొక్క జొన్న రైతులను ఆదుకుందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. 66 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొక్క జొన్న ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లోని 3,330 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే 5,036 మంది రైతులు సీఎం యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరి నుంచి కనీస మద్దుత ధర రూ.1,962 చొప్పున ఫైన్‌ వెరైటీ మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 60 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. బాపట్ల, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో 17–18.5 శాతం తేమ ఉన్నట్టుగా గుర్తించారు. తేమ శాతాన్ని 14 శాతానికి తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. 


ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా..
జిల్లా            రైతుల సంఖ్య        సేకరించిన ధాన్యం (టన్నుల్లో)
పశ్చిమగోదావరి    28,650            2,62,711
ఏలూరు            11,423            1,34,543
తూర్పుగోదావరి    12,998            1,19,748
కోనసీమ        5,975                46,669
కాకినాడ            2,481                18,357
కృష్ణా            2,598                15,298
బాపట్ల            1968                12,014
నెల్లూరు            281                4257
ప్రకాశం            411                2577
ఎన్టీఆర్‌            113                1456 
–––––

వేగంగా స్పందించి కొన్నారు

నేను 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎక­రా­నికి 45 బస్తాల దిగుబడి వచ్చింది. అకాల వర్షాలు భయపెట్టాయి. ధాన్యం తడిసిపోయి 48 గంటలు దాటకుండానే ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 చొప్పున ఇచ్చా­రు. 6 రోజుల్లోనే బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం ఎన్నడూ చూడలేదు.    – కుసుమ శివప్రసాద్, ఈదరాడ, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 

ప్రభుత్వం వల్లే ధాన్యం అమ్మగలిగా
రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మిషన్‌తో కోయించా. వర్షానికి తడిసిపోయిందని తక్కువ రేటుకు అడిగారు. ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కలెక్టర్, అధికారులు మా గ్రామానికి వచ్చినప్పుడు చూపించా. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్బీకే సిబ్బంది సంచులిచ్చి, దగ్గరుండి కాటా వేయించి, ట్రాక్టర్‌తో రైసు మిల్లుకు తీసుకెళ్లారు. మద్దతు ధరకు కొంటామని చెప్పడంతో గట్టెక్కగలిగాను. లేకపోతే అయినకాడకు అమ్ముకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది.
పేపకాయల వెంకటరమణ, కౌలురైతు, కరప, కాకినాడ జిల్లా    

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
జిల్లా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతుల వద్ద ఉన్న తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. తుపాన్‌ను దృష్టిలో పెట్టుకొని రైతుల వద్ద కోత కోసిన ధాన్యాన్ని సేకరించేందుకు ఆదేశాలిచ్చాం. అలాగే చేలల్లో నీరు నిల్వ ఉన్న చోట్ల బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాం.
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ, స్పెషలాఫీసర్, పశ్చిమగోదావరి జిల్లా

వేగంగా ధాన్యం తరలింపు
అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిచింది. ఎక్కడా ఆరబెట్టుకోలేని పరిస్థితి. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. అందుకు చాలా వరకు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాం. తడిచిన, మొలకొచ్చిన ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నాం. వాటిని బాయిల్డ్‌ రకాల జాబితాలో కొనుగోలు చేసి బాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తున్నాం. కోసిన పంట కోసినట్టు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసి సేకరిస్తున్నాం. ప్రత్యేక అధికారుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల సంస్థ డీఎంలు, తహసీల్దార్లు, ఏవోలు, ఆర్బీకే సిబ్బంది ఇలా నిరంతరం రైతులకు అందుబాటులో ఉన్నారు.  
హెచ్‌.అరుణ్‌ కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ 

రబీ సీజన్‌లో టీడీపీ హయాంలో కొనుగోళ్లు ఇలా..
సంవత్సరం        టన్నులు
2014–15        18,91,106
2015–16        20,70,540
2016–17        16,95,341
2017–18        18,12,994
2018–19        16,47,193
(మార్చి 31 వరకు)
మొత్తం            91,17,174
––––
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక
2018–19        11,05,578
(ఏప్రిల్‌ 1నుంచి)
2019–20        34,73,827
2020–21        37,23,522
2021–22        26,22,386
2022–23        6,17,761
(మే 6వ తేదీ వరకు)    
            1,15,43,074

ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక అధికారులు
జిల్లా                    ఐఏఎస్‌ అధికారి
అల్లూరి సీతారామరాజు        ప్రవీణ్‌కుమార్, ఎండీ ఎపీఐఐసీ
అనకాపల్లి                జే.నివాస్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ
బాపట్ల                    కాటమనేని భాస్కర్, కమిషనర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (ఇన్‌ఫ్రా)
తూర్పు గోదావరి            వివేక్‌యాదవ్, కమిషనర్‌ సీఆర్‌డీఎ
ఏలూరు                    శశిభూషణ్‌కుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జలవనరుల శాఖ
గుంటూరు                ఎండీ ఇంతియాజ్, చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్, సెర్ప్‌
కాకినాడ                    పీఎస్‌ ప్రద్యుమ్న, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా     వీరపాండ్యన్, ఎండీ ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌
కృష్ణా                    లక్ష్మీశా, ఎండీ, ఎపీఎస్‌హెచ్‌సీఎల్‌
ఎన్టీఆర్‌                    గిరిజా శంకర్, కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ
ఎస్‌పీఎస్‌ నెల్లూరు            చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ
పల్నాడు                సూర్యకుమారి, కమిషనర్, పంచాయతీరాజ్‌
పార్వతీపురం మన్యం        ముద్దాడ రవిచంద్ర, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
ప్రకాశం                    ఎం.టీ.కృష్ణబాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ
శ్రీకాకుళం                సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌
విజయనగరం                సురేష్‌ కుమార్, కమిషనర్, పాఠశాల విద్య
పశ్చిమగోదావరి            కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ
అనంతపురం                ఎస్‌ఎస్‌ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ


డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని గొల్లవిల్లి గ్రామానికి చెందిన సలాది లక్ష్మణబాబు.. రబీలో రెండున్నర ఎకరాల్లో ఎంటీయూ–3626 (జయ) రకం ధాన్యం సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాడు. తెగుళ్ల బెడద లేకపోవడంతో దిగుబడి బాగా వచ్చింది. కోతలు కోసి కుప్పనూర్చాడు. అయితే తెల్లారేసరికి కుండపోత వర్షాలు. వారం పాటు ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన చెందాడు.  కళ్లెదుటే ధాన్యంలో కొంత మేర మొలకలొచ్చేశాయి. కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని భయపడ్డాడు. అంతలో ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించడంతో కలెక్టర్‌ సహా అధికారులంతా ఆ గ్రామానికి వచ్చారు. మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. వెంటనే బస్తాలకు ఎక్కించి మిల్లుకు తరలించారు. ‘ఆందోళన చెందకండి.. కనీస మద్దతు ధరకు మీ ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని అభయమిచ్చారు. దీంతో లక్ష్మణబాబు ఆందోళన మాయమైంది. కాకినాడ జిల్లా పత్తిగొందికి చెందిన సేలం శ్రీనివాసరావు 10 ఎకరాల్లో వరివేశాడు. మాసూళ్లు ప్రారంభించే సరికి కురిసిన భారీ వర్షాలతో 4 ఎకరాల్లో పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తీవ్ర నష్టం జరగకుండా చూశారు. ముంపునకు గురైన వరిచేలలో నీటిని ఉపాధి కూలీల సాయంతో అధికారులు బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. వరి పనలు మొలకెత్తకుండా శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఉప్పునీటి ద్రావణం చల్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో ఇతనికి ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడిన ప్రతి చోటా ప్రభుత్వం రైతుల వెన్నంటి ఉంటూ అండగా నిలుస్తోంది.

            
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement