చదరపు అడుగుకు రూ.5 వేలు!
♦ మంగళగిరిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సర్కారు సిద్ధం
♦ ఎంత హైటెక్ భవనమైనా ఎస్‌ఎఫ్‌టీకి రూ.3 వేలు మించదంటున్న రియల్టర్లు
♦ సర్కారు తీరుపై విస్మయం ప్రజాధనాన్ని దోచుకునేందుకేననే విమర్శలు
♦ నాలుగు కాంప్లెక్స్‌లకు గాను రూ.300 కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: ఇన్నిరోజులు తాత్కాలిక సచివాలయాన్ని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరోచోట సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మంగళగిరికి ఆనుకుని ఉన్న సీఆర్‌డీఏ స్థలంలో దాన్ని నిర్మించనుంది. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనుంది. ఒక ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణానికి రూ.5 వేలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ ఫైలుకు సోమవారం సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నేడోరేపో సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాంప్లెక్స్‌ల నిర్మాణం ఎంత విలాసవంతంగా, ఎన్ని ఆధునిక హంగులతో చేపట్టినా చదరపు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టీ) రూ.3 వేలకు మించి ఖర్చవదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏకంగా రూ.5 వేలు వెచ్చించడమంటే ప్రజాధనాన్ని దోచుకోవడమేనని వారు స్పష్టం చేశారు. ఇలా రూ.5 వేలు లెక్కన 6 లక్షల చదరపు అడుగుల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.300 కోట్లు వ్యయం చేయనుంది.
2018 నాటికి రాజధాని నిర్మాణం మొదటి దశ పూర్తి చేస్తామని సీఎం చెబుతున్నారని, ఈ లెక్కన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ భవనాలు ఏడాదిలోనే నిర్మించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు తాత్కాలిక సచివాలయం కోసం రూ.300 కోట్లు దుబారా చేయడం ఎంతవరకు సమంజసమని సచివాలయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.300 కోట్లలో రూ.150 కోట్లు హడ్కో నుంచి రుణంగా పొందాలని, మిగతా రూ.150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకున్నారు.
సీఆర్‌డీఏకి చెందిన 23 ఎకరాల్లో నాలుగు కాంప్లెక్స్‌ల్లో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. టెండర్లను ఆహ్వానించి కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా జూన్ నాటికి పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. సీఎం ప్రస్తుతం నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కు తాత్కాలిక సచివాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అఖిల భారత సర్వీసు అధికారుల నివాస వసతి కోసం రెయిన్ ట్రీ పార్కులో గల అపార్టుమెంట్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. అక్కడి నుంచి తాత్కాలిక సచివాలయం 9కి.మీ దూరంలో ఉంటుంది.