రూ. 2 కోట్ల స్థలం కబ్జా! | Town Planning Officials Land Corruption In Nellore | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల స్థలం కబ్జా!

Published Sat, Aug 17 2019 12:59 PM | Last Updated on Sat, Aug 17 2019 1:00 PM

Town Planning Officials Land Corruption In Nellore - Sakshi

అది గూడూరు పట్టణంలో ఎంతో విలువైన స్థలం. అక్కడ అంకణం విలువ సుమారు రూ.20 లక్షలకు పైమాటే. అలాంటి  ప్రాంతంలో సుమారు 10 అంకణాలకు పైగా రూ.2 కోట్ల విలువజేసే స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఏకంగా ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులిచ్చారు. సంబంధిత   ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు.

సాక్షి, గూడూరు: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా పురాతన గడియారం బిల్డింగ్‌ ఉండేది. అప్పట్లో వాహనాల పార్కింగ్‌ నిమిత్తం ఆ భవనానికి ముందుగా సుమారు 10 నుంచి 15 అంకణాల వరకూ ఆర్‌అండ్‌బీ అధికారులు స్థలాన్ని వదిలి ఉంచారు. కాలక్రమంలో ఆ గడియారం బిల్డింగ్‌ ఉన్న స్థలాన్ని ప్లాట్ల రూపంలో విభజించి విక్రయించారు. ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీ పార్కింగ్‌ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తుల కన్ను పార్కింగ్‌ నిమిత్తం వదిలిన స్థలంపై పడింది. ఇదే అదనుగా ఆ దుకాణ సముదాయం నిర్మించే బిల్డర్, సేవ ముసుగులో అవినీతికి పాల్పడే ఎల్‌బీఎస్‌లు(లైసెన్స్‌డ్‌ బిల్డింగ్‌ సర్వేయర్‌) టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపి, ఆ శాఖ అధికారులకు భవన నిర్మాణధారుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు ఇప్పించారు. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడకుండా వారికి కూడా నగదు ముట్టజెప్పినట్లు బిల్డర్, ఎల్‌బీఎస్‌లు చర్చించుకుంటున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో కొనుగోలు చేసిన స్థలంతోపాటు కబ్జా చేసిన స్థలాన్ని కలుపుకుని భారీ స్థాయిలో దుకాణ సముదాయ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణం చేపట్టే స్థలానికి ముందుకు వచ్చి కనీసం సెట్‌ బ్యాక్‌లకు కూడా స్థలం వదలకుండా పెద్ద పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలం నాడే ముందు చూపుతో ఆ శాఖాధికారులు పార్కింగ్‌ అవసరాల నిమిత్తం స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీతో ఆ
స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆర్‌అండ్‌బీ అధికారులు కాపాడుకోవాల్సి ఉంది. అయితే దర్జాగా కబ్జా చేసేస్తుంటే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

హద్దులు చూపాలని తహసీల్దార్‌ను కోరాం 
మా శాఖకు చెందిన పార్కింగ్‌ స్థలం అక్కడ ఉందని మా దృష్టికి వచ్చింది. దీంతో గతంలోనే ఆ స్థలానికి సంబంధించిన హద్దులు చూపాలని తహసీల్దార్‌ను రాత పూర్వకంగా కోరాం. కబ్జాకు గురవుతుందని తెలిసింది కాబట్టి మా స్థలాన్ని కాపాడుకునేందుకు మళ్లీ హద్దులు చూపాలని అడుగుతాం. మా స్థలంలో నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వివేకానంద, ఈఈ, ఆర్‌అండ్‌బీ శాఖ

పరిశీలించి చర్యలు తీసుకుంటాం 
పట్టణంలో స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. కబ్జాకు గురైనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. 
– ఓబులేశు, మున్సిపల్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement