‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఉన్నపళంగా పొమ్మని గెంటేస్తే ఎక్కడికి పోతాం. మా తాతల కాలం నుంచీ ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్నామన్న సాకుతో ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మనడం భావ్యమా..’ అంటూ బీసెంట్‌రోడ్డులోని 500 మంది హాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం వారిని ఖాళీచేయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన బాట పట్టిన వారికి వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది.
బీసెంట్‌రోడ్డు హాకర్లు
విజయవాడ సెంట్రల్ : ఆక్రమణల తొలగింపు ముసుగులో బీసెంట్‌రోడ్డులోని హాకర్లను ఖాళీ చేయించడం వివాదాస్పదంగామారింది. సుమారు 500 మంది హాకర్లు అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నలభైఏళ్ళ నుంచి బీసెంట్‌రోడ్డునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలో ఉండడంతో హాకర్లను అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టౌన్‌ప్లానింగ్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై వ్యాపారాలు చేసుకొనే చిన్నా చితక వ్యాపారుల్ని అక్కడ నుంచి గెంటేశారు. బుధవారం ఉదయం కూడా వ్యాపారాలు చేయకుండా పోలీసులు గస్తీకాశారు. హాకర్లు ఆందోళన బాట పట్టారు. ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముజ్‌ఫర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ బాసట
బాధిత హాకర్లకు వైఎస్సార్‌సీపీ బాసటగా నిల్చింది. వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ బీఎన్ పుణ్యశీల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు హాకర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పుణ్యశీల మాట్లాడుతూ పేదల పొట్టకొట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా గెంటేస్తే ఎక్కడిపోతారని ప్రశ్నించారు. దీనిపై ఈనెల 29న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అధికారపార్టీని నిలదీస్తామన్నారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, పి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన పేదోళ్లు బతక్కూడదంటే ఎలా. మా తాతల కాలం నుంచి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాం. టీడీపోళ్లు ఓట్లు అడిగేటప్పుడు మీరు దర్జాగా ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. పోలీసోళ్లు, కార్పొరేషనోళ్లు వచ్చి జులుం చేస్తున్నారని ఫోన్ చేస్తే మాట్లాడటమే మానేశారన్నారు. చావనైనా చస్తాం కానీ బీసెంట్‌రోడ్డును వదిలేదిలేదని హాకర్లు స్పష్టం చేస్తున్నారు.
చావనైనా చస్తాం.. కదిలేది లేదు
Published Thu, Jan 21 2016 2:01 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement