Bisent road
-
చావనైనా చస్తాం.. కదిలేది లేదు
‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఉన్నపళంగా పొమ్మని గెంటేస్తే ఎక్కడికి పోతాం. మా తాతల కాలం నుంచీ ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్నామన్న సాకుతో ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మనడం భావ్యమా..’ అంటూ బీసెంట్‌రోడ్డులోని 500 మంది హాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం వారిని ఖాళీచేయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన బాట పట్టిన వారికి వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. బీసెంట్‌రోడ్డు హాకర్లు విజయవాడ సెంట్రల్ : ఆక్రమణల తొలగింపు ముసుగులో బీసెంట్‌రోడ్డులోని హాకర్లను ఖాళీ చేయించడం వివాదాస్పదంగామారింది. సుమారు 500 మంది హాకర్లు అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నలభైఏళ్ళ నుంచి బీసెంట్రోడ్డునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలో ఉండడంతో హాకర్లను అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టౌన్‌ప్లానింగ్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై వ్యాపారాలు చేసుకొనే చిన్నా చితక వ్యాపారుల్ని అక్కడ నుంచి గెంటేశారు. బుధవారం ఉదయం కూడా వ్యాపారాలు చేయకుండా పోలీసులు గస్తీకాశారు. హాకర్లు ఆందోళన బాట పట్టారు. ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముజ్ఫర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బాసట బాధిత హాకర్లకు వైఎస్సార్సీపీ బాసటగా నిల్చింది. వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ బీఎన్ పుణ్యశీల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు హాకర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పుణ్యశీల మాట్లాడుతూ పేదల పొట్టకొట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా గెంటేస్తే ఎక్కడిపోతారని ప్రశ్నించారు. దీనిపై ఈనెల 29న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అధికారపార్టీని నిలదీస్తామన్నారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, పి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన పేదోళ్లు బతక్కూడదంటే ఎలా. మా తాతల కాలం నుంచి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాం. టీడీపోళ్లు ఓట్లు అడిగేటప్పుడు మీరు దర్జాగా ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. పోలీసోళ్లు, కార్పొరేషనోళ్లు వచ్చి జులుం చేస్తున్నారని ఫోన్ చేస్తే మాట్లాడటమే మానేశారన్నారు. చావనైనా చస్తాం కానీ బీసెంట్రోడ్డును వదిలేదిలేదని హాకర్లు స్పష్టం చేస్తున్నారు. -
సినీ ఫక్కీలో చోరీ
బెస్ట్ వన్ షోరూంలో రూ.7లక్షల నగదు అపహరణ బీసెంట్‌రోడ్డులో కలకలం ఆరితేరిన దొంగలముఠా పనే అని పోలీసుల అనుమానం గాంధీనగర్ : తలపై లైటు... మంకీ క్యాప్, చేతులకు గ్లవ్స్... పక్కా ప్రణాళిక రచించారు. సినీ ఫక్కీలో షోరూంలోకి ప్రవేశించారు. సీసీ కెమెరా కంట పడకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. షోరూంలో 16 సీసీ కెమెరాలు ఉండగా, 14 కెమెరాల కనెక్షన్లు కట్ చేశారు. క్యాష్ కౌంటర్‌ను కొల్లగొట్టారు. రూ.7లక్షలు అపహరించారు. ఇదీ శనివారం రాత్రి బీసెంట్‌రోడ్డులోని బెస్ట్ వన్ షోరూంలో జరిగిన తీరు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే పరిసరాలపై పూర్తిగా అవగాహన ఉన్న రాటుదేలిన దొంగలే చేశారని స్పష్టమవుతోంది. ఈ ఘటన బీసెంట్‌రోడ్డులో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు... నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన బీవీఎల్పీ రంగనాథ్ బీసెంట్‌రోడ్డులో రెడీమేడ్ షోరూం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసివేసి వెళ్లారు. ఆదివారం ఉదయం 10.15 గంటలకు రంగనాథ్ బావమరిది పవన్‌కుమార్ షాపు తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్ తెరిచి ఉంది. విషయాన్ని తన బావ రంగనాథ్‌కు తెలియజేశారు. ఆయన వచ్చి చూడగా కౌంటర్లో ఉంచిన రూ. 7లక్షల నగదు కనిపించలేదు. కౌంటర్ వద్ద వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీనిపై గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూం పైభాగంలో సరుకు నిల్వ చేసేందుకు నిర్మించిన గదికి పై కప్పుకు రేకులు వేశామని, ఒక రేకు తొలగించి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షెడ్డులోపలికి ప్రవేశించేందుకు దుండగులు నిచ్చెన ఉపయోగించారని, సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశారని తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య చోరీ.. షోరూం పై భాగంలో గోడౌన్ కోసం గది నిర్మించారు. పై కప్పుకు రేకులు వేశారు. దుండగులు తొలుత ఆ గది షట్టర్ పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లు న్నాయి. సాధ్యం కాకపోవడంతో పై కప్పుకు వేసిన సిమెంట్ రేకును తొలగించి, నిచ్చెన ద్వారా గదిలోకి ప్రవేశించినట్లు అక్కడే వదిలి వెళ్లిన నిచ్చెన ఆధారంగా తెలుస్తోంది. గది లోపల మెట్ల వద్ద ఉన్న సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేసి ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోని సీసీ కెమెరా కనెక్షన్‌ను తొలగించినట్లు ఉంది. షోరూం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లాక్ పగలగొట్టి నగదు చోరీ చేశారు. షోరూంలో మొత్తం పదహారు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు షోరూం యజమాని రంగనాథ్ తెలిపారు. క్రైం ఏసీపీ సుందరరాజు షోరూంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. షోరూం పై భాగంలోని గదిలో ఏర్పాటుచేసిన కెమెరా దుండగులు లోపలికి ప్రవేశించే దృశ్యాలను చిత్రీకరించినట్లు గుర్తించారు. షోరూం లోపలికి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పై భాగంలో ఏర్పాటుచేసిన కెమెరా నైట్ విజిబిలిటీ కలిగి ఉందని యజమాని తెలిపారు. అందువల్లే దుండగులు ప్రవేశించిన దృశ్యాలు రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాతే సీసీ కెమెరా కనెక్షన్‌ను కట్ చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తంచేశారు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న కెమెరాలోనూ కొన్ని దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి 2 నుంచి 3.15 గంటల మధ్య మధ్య చోరీ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. 16వ నంబరు సీసీ కెమెరాలో 2.47 నిమిషాలకు ఇద్దరు షోరూం పై భాగంలో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఆ తర్వాత 2వ నంబరు సీసీ కెమెరాలో 2. 58 నుంచి 3.04 గంటల వరకు క్యాష్ కౌంటర్ వద్ద ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి, తలపై టార్చ్‌ను ఏర్పాటుచేసుకుని చోరీ చేస్తున్నట్లు రికార్డు అయింది. ఇవి మినహా షోరూంలోని ఇతర కెమెరాలు పనిచేసినట్లు ఆధారాలు లేవని యజమాని తెలిపారు. క్లూస్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని కొన్ని ఆధారాలు సేకరించింది. దుండగులు ఉపయోగించిన నిచ్చెన ఎక్కడిది... వెంట తెచ్చుకున్నారా.. చోరీ చేసింది ఇద్దరా.. లేక ఎక్కువ మంది ఉన్నారా.. ఇలా పలు కోణాల్లో గవర్నర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీసెంట్‌రోడ్డులో బజ్జీలు తినాలనుంది!
మనసులోని మాట నగరంతో విడదీయరాని అనుబంధం కార్యకర్తలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడ నగరంలో తిరగాలని.. బీసెంట్‌రోడ్డులో బజ్జీలు తినాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. బాధ్యతలున్న కారణంగా అది సాధ్యం కావడంలేదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి నగరానికి వచ్చిన ఆయన స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడ నగరంతో తనకెంతో అనుబంధం ఉందని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పుడు జీవితంలో కొన్ని త్యాగం చేయాలని తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలకు హితబోధ చేశారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. దేశంలో దృఢమైన నాయకత్వం, నీతినిజాయితీ గల ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించిన ప్రజలు నరేంద్రమోడికి పట్టం కట్టారని తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సీమాంధ్ర హక్కుల కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడారని కొనియాడారు. అనంతరం శతావధాని నాగఫణిశర్మ కేంద్ర మంత్రి, ఎంపీలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా, నగర శాఖలు, ఇతర విభాగాల కార్యకర్తలు వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద వెంకయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు (విశాఖ), ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి), మాణిక్యాలరావు (తాడేపల్లిగూడెం), కామినేని శ్రీనివాసరావు (కైకలూరు), మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, నాయకులు రామినేని వెంకటకృష్ణ, దాసం ఉమామహేశ్వరరాజు, పూర్ణచంద్రరావు, లక్ష్మీపతిరాజా, మాలతీరాణి, ఎర్నేని సీతాదేవి, వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.