బెస్ట్ వన్ షోరూంలో రూ.7లక్షల నగదు అపహరణ
బీసెంట్‌రోడ్డులో కలకలం
ఆరితేరిన దొంగలముఠా పనే అని పోలీసుల అనుమానం
గాంధీనగర్ : తలపై లైటు... మంకీ క్యాప్, చేతులకు గ్లవ్స్... పక్కా ప్రణాళిక రచించారు. సినీ ఫక్కీలో షోరూంలోకి ప్రవేశించారు. సీసీ కెమెరా కంట పడకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. షోరూంలో 16 సీసీ కెమెరాలు ఉండగా, 14 కెమెరాల కనెక్షన్లు కట్ చేశారు. క్యాష్ కౌంటర్‌ను కొల్లగొట్టారు. రూ.7లక్షలు అపహరించారు. ఇదీ శనివారం రాత్రి బీసెంట్‌రోడ్డులోని బెస్ట్ వన్ షోరూంలో జరిగిన తీరు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే పరిసరాలపై పూర్తిగా అవగాహన ఉన్న రాటుదేలిన దొంగలే చేశారని స్పష్టమవుతోంది. ఈ ఘటన బీసెంట్‌రోడ్డులో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు... నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన బీవీఎల్‌పీ రంగనాథ్ బీసెంట్‌రోడ్డులో రెడీమేడ్ షోరూం నిర్వహిస్తున్నారు.
ఆయన శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసివేసి వెళ్లారు. ఆదివారం ఉదయం 10.15 గంటలకు రంగనాథ్ బావమరిది పవన్‌కుమార్ షాపు తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్ తెరిచి ఉంది. విషయాన్ని తన బావ రంగనాథ్‌కు తెలియజేశారు. ఆయన వచ్చి చూడగా కౌంటర్‌లో ఉంచిన రూ. 7లక్షల నగదు కనిపించలేదు. కౌంటర్ వద్ద వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీనిపై గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూం పైభాగంలో సరుకు నిల్వ చేసేందుకు నిర్మించిన గదికి పై కప్పుకు రేకులు వేశామని, ఒక రేకు తొలగించి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షెడ్డులోపలికి ప్రవేశించేందుకు దుండగులు నిచ్చెన ఉపయోగించారని, సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశారని తెలిపారు.
అర్ధరాత్రి 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య చోరీ..
షోరూం పై భాగంలో గోడౌన్ కోసం గది నిర్మించారు. పై కప్పుకు రేకులు వేశారు. దుండగులు తొలుత ఆ గది షట్టర్ పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లు న్నాయి. సాధ్యం కాకపోవడంతో పై కప్పుకు వేసిన సిమెంట్ రేకును తొలగించి, నిచ్చెన ద్వారా గదిలోకి ప్రవేశించినట్లు అక్కడే వదిలి వెళ్లిన నిచ్చెన ఆధారంగా తెలుస్తోంది. గది లోపల మెట్ల వద్ద ఉన్న సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేసి ఉంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లోని సీసీ కెమెరా కనెక్షన్‌ను తొలగించినట్లు ఉంది. షోరూం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లాక్ పగలగొట్టి నగదు చోరీ చేశారు. షోరూంలో మొత్తం పదహారు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు షోరూం యజమాని రంగనాథ్ తెలిపారు. క్రైం ఏసీపీ సుందరరాజు షోరూంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. షోరూం పై భాగంలోని గదిలో ఏర్పాటుచేసిన కెమెరా దుండగులు లోపలికి ప్రవేశించే దృశ్యాలను చిత్రీకరించినట్లు గుర్తించారు.
షోరూం లోపలికి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పై భాగంలో ఏర్పాటుచేసిన కెమెరా నైట్ విజిబిలిటీ కలిగి ఉందని యజమాని తెలిపారు. అందువల్లే దుండగులు ప్రవేశించిన దృశ్యాలు రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాతే సీసీ కెమెరా కనెక్షన్‌ను కట్ చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తంచేశారు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న కెమెరాలోనూ కొన్ని దృశ్యాలు రికార్డయినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి 2 నుంచి 3.15 గంటల మధ్య మధ్య చోరీ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. 16వ నంబరు సీసీ కెమెరాలో 2.47 నిమిషాలకు ఇద్దరు షోరూం పై భాగంలో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఆ తర్వాత 2వ నంబరు సీసీ కెమెరాలో 2. 58 నుంచి 3.04 గంటల వరకు క్యాష్ కౌంటర్ వద్ద ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి, తలపై టార్చ్‌ను ఏర్పాటుచేసుకుని చోరీ చేస్తున్నట్లు రికార్డు అయింది. ఇవి మినహా షోరూంలోని ఇతర కెమెరాలు పనిచేసినట్లు ఆధారాలు లేవని యజమాని తెలిపారు. క్లూస్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని కొన్ని ఆధారాలు సేకరించింది. దుండగులు ఉపయోగించిన నిచ్చెన ఎక్కడిది... వెంట తెచ్చుకున్నారా.. చోరీ చేసింది ఇద్దరా.. లేక ఎక్కువ మంది ఉన్నారా.. ఇలా పలు కోణాల్లో గవర్నర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సినీ ఫక్కీలో చోరీ
Published Mon, Feb 23 2015 12:55 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
Advertisement
Advertisement