బీసెంట్‌రోడ్డులో బజ్జీలు తినాలనుంది!
- మనసులోని మాట
- నగరంతో విడదీయరాని అనుబంధం
- కార్యకర్తలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడ నగరంలో తిరగాలని.. బీసెంట్‌రోడ్డులో బజ్జీలు తినాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. బాధ్యతలున్న కారణంగా అది సాధ్యం కావడంలేదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం తొలిసారి నగరానికి వచ్చిన ఆయన స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.
సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయ రాజధానిగా పేరున్న విజయవాడ నగరంతో తనకెంతో అనుబంధం ఉందని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
బాధ్యతలు ఉన్నప్పుడు జీవితంలో కొన్ని త్యాగం చేయాలని తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలకు హితబోధ చేశారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. దేశంలో దృఢమైన నాయకత్వం, నీతినిజాయితీ గల ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించిన ప్రజలు నరేంద్రమోడికి పట్టం కట్టారని తెలిపారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ సీమాంధ్ర హక్కుల కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పోరాడారని కొనియాడారు. అనంతరం శతావధాని నాగఫణిశర్మ కేంద్ర మంత్రి, ఎంపీలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా, నగర శాఖలు, ఇతర విభాగాల కార్యకర్తలు వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద వెంకయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు (విశాఖ), ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి), మాణిక్యాలరావు (తాడేపల్లిగూడెం), కామినేని శ్రీనివాసరావు (కైకలూరు), మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, నాయకులు రామినేని వెంకటకృష్ణ, దాసం ఉమామహేశ్వరరాజు, పూర్ణచంద్రరావు, లక్ష్మీపతిరాజా, మాలతీరాణి, ఎర్నేని సీతాదేవి, వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.