పాలక, ప్రతిపక్షాల ముప్పేట దాడి
పాత భవనాలు, పింఛన్లపై
వాడీవేడి చర్చ మేయర్ తీరు మారింది
విజయవాడ సెంట్రల్ : యూసీడీ, టౌన్‌ప్లానింగ్ విభాగాల పనితీరు అధ్వానంగా ఉందంటూ పాలక, ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నల వర్షంతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పురాతన భవనాలపై రసవత్తర చర్చ నడిచింది. నగరంలో పురాతన భవనాలు కూలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కో-ఆప్షన్ సభ్యుడు సిద్దం నాగేంద్రరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సభ్యురాలు సుభాషిణి మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పురాతన భవనంపై రెండో అంతస్తు కొత్తగా నిర్మించినా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. సిటీప్లానర్ చక్రపాణి మాట్లాడుతూ నగరంలో 183 పురాతన భవనాలను గుర్తించామని, ఎనిమిది కూల్చివేశామని, మిగిలిన వాటికి సంబంధించి యజమానులు, అద్దెదారులు కోర్టులకు వెళ్లడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని వివరించారు. 2012 లో కోర్టులో కేసులు నమోదైతే ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదని కో-ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి ప్రశ్నించారు. త్వరలోనే స్టే వెకేట్ చేయిస్తామని సిటీ ప్లానర్ చెప్పారు. పురాతన భవనాలను గుర్తించేందుకు త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ్యులు ప్రశ్నిస్తే గానీ పురాతన భవనాల విషయాన్ని కౌన్సిల్‌కు చెప్పరా.. అని మేయర్ ప్రశ్నించారు. పనితీరు మార్చుకోవాలని సిటీప్లానర్‌ను హెచ్చరించారు.
అధ్వానంగా యూసీడీ విభాగం తీరు
అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగం పనితీరు అధ్వానంగా ఉందని పాలక, ప్రతిపక్ష సభ్యులు అధికారులపై విరుచుకుపడ్డారు. జనశ్రీబీమా యోజన, అభయహస్తం పథకాల కింద లబ్ధిదారులకు బీమా సొమ్ము అందడం లేదని సభ్యులు జాస్తి సాంబశివరావు, ముప్పా వెంకటేశ్వరరావు, బండినాగేంద్ర పుణ్యశీల, వీరమాచినేని లలిత, అవుతు శ్రీశైలజ ఆరోపించారు. యూసీడీ విభాగంలోకి సమాధానం చెప్పే అధికారి కరువయ్యారన్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీ ఇంతవరకు గాడిలో పడలేదని ఉమ్మడిశెట్టి బహుదూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పింఛన్ల కోసం తమ వద్దకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, కాకు మల్లికార్జున యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లకు సంబంధించి పీవో కె.శకుంతల గణాంకాలను వివరించారు. కాకిలెక్కలతో పీవో గారడీ చేస్తున్నారని, కావాలంటే బాధితులను పిలిపిస్తానని బహుదూర్ అన్నారు. సభ్యుల వాదనతో ఏకీభవించిన మేయర్ కింది సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే యూసీడీ పనితీరు అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. ప్రక్షాళనకు త్వరలోనే చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
మేయర్ తీరు మారింది
గత రెండు సమావేశాలకు భిన్నంగా మేయర్ కౌన్సిల్‌ను నిర్వహించారు. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా సభను సజావుగా నడపగలిగారు. దీంతో ఒక్కరోజులోనే 238 అంశాలపై చర్చ ముగిసింది. దండం పెట్టి అడుగుతున్నా.. కొందరు అధికారులు సహకరించడం లేదంటూ సభ్యులకు వివరించారు. త్వరలోనే అన్ని విభాగాలను గాడిలో పెట్టేందుకు తనవంతు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, అదనపు కమిషనర్ జి.నాగరాజు, చీఫ్ ఇంజనీర్ ఎంఏ షుకూర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులే టార్గెట్
Published Tue, Feb 10 2015 1:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement