రెజిమెంటల్‌బజార్‌లో అక్రమ నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: టౌన్ ప్లానింగ్ విభాగమంటేనే అక్రమాలకు పర్యాయ పదంగా పేరుంది. దీన్ని మార్చేందుకు, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. భవననిర్మాణ అనుమతుల్లో లంచాలను అరికట్టేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినా...చేయి తడపనిదే పనులు కావడం లేవు. ఇక అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులు, దిగువస్థాయి సిబ్బంది అక్రమనిర్మాణాలు అడ్డుకోవడం మాని అక్రమార్కులకు సహకరిస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్నారు. మరోవైపు కోర్టు స్టేలు తెచ్చుకోవాల్సిందిగా మార్గదర్శనం చేస్తున్నారు. ఇదంతా ఎంతోకాలంగా జరుగుతోన్న తంతు. ప్రస్తుతం ఎన్నికల పనులు జరుగుతుండటంతో ఎన్నికల విధుల్లోనూ పాల్గొనాల్సి ఉంది. దీన్ని సాకుగా చూపుతూ అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు.
ఎన్నికల బిజీ అంటూ దాట వేస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణదారులను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘ఇదే సరైన అదను. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కూల్చివేసేందుకూ సమయముండదు. త్వరత్వరగా అక్రమ నిర్మాణాలు పూర్తిచేసుకోండంటూ’ తగిన సలహాలిస్తూ తమ వంతు సహాయం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమ నిర్మాణం ఆలోచన లేని వారు సైతం అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో బహుళ అంతస్తుల భవనాలతో పాటు ఇరుకుగల్లీల్లో 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్న సందుల్లోనూ అదనపు అంతస్తులు వేసేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో సహ ఉన్నతాధికారులు సైతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో అటుఅక్రమ అంతస్తులకు, ఇటు అధికారుల లంచాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కార్పొరేటర్ స్థాయి నేతలు సైతం ఈ సమయాన్ని సానుకూలంగా మలచుకొని తమ లాభం తాము చూసుకొని అక్రమ నిర్మాణాలకు తమవంతు సాయమందిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేసేవారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు అందరూ దీన్నే తమకు ‘అనుకూల’ సమయంగా మలచుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాదు.. హెచ్‌ఎండీఏ పరిధిలోని శివార్లలోనూ ఇదే తీరు. జీహెచ్‌ఎంసీకి దాదాపు మూడేళ్లక్రితం బీఆర్‌ఎస్ కోసం అందిన దరఖాస్తులు 1.39 లక్షలు. ఆ గడువు ముగిశాక సైతం ఇప్పటి వరకు లక్షకు పైగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అంచనా. నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల్లో కొన్ని...
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో...
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి , చందానగర్ సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్, శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్రకాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలో గోకుల్ ప్లాట్స్, మదీనాగూడ, చందానగర్, దీప్తీశ్రీనగర్, ఎంఏనగర్, హాఫీజ్‌పేట్, బీకే ఎన్‌క్లేవ్, న్యూ కాలనీ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ ఎస్‌ఈజడ్‌కు ఎదురుగా ఓ వ్యక్తి మూడు అంతస్తుల అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల భవనం నిర్మించారు.
♦ మియాపూర్ న్యూ కాలనీలో మూడు భవనాలు రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని అదనంగా ఒక అంతస్తు నిర్మిస్తున్నారు. బీకే ఎన్‌క్లేవ్‌లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదని ఉన్నా ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నారు.
♦ హాఫీజ్‌పేట్ ఆర్‌టీసీ కాలనీలో రెండు అంతస్తులు నిర్మించేందుకు అనుమతి తీసుకొని అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు
టకారా బస్తీలో గాలిలో మేడలు..
రాంగోపాల్‌పేట్: మోండా డివిజన్‌లోని టకారాబస్తీలో గాలిలో మేడలు వెలుస్తున్నాయి. టకారాబస్తీలో జీ ప్లస్ రెండంతస్తులకు మాత్రమే అనుమతి పొందినప్పటికీ, పెంట్‌హౌస్‌తో సహ ఆరంతస్తుల భవనం వెలిసింది. రేతిఫైలి బస్టాండ్ ఎదురుగా రెజిమెంటల్ బజార్‌లో జీప్లస్ 2 అంతస్తులకు మాత్రం అనుమతి పొంది అదనంగా మరో అంతస్తు నిర్మాణం చేపట్టారు. నివాస భవనానికి అనుమతులు పొంది మూడంతస్తులతో లాడ్జి నిర్మాణం జరుగుతుండటంతో గుర్తించిన స్థానికులు ఫిర్యాదు చేసినా, నిర్మాణం పూర్తయ్యేంతదాకా మౌనం దాల్చారు. నిర్మాణం పూర్తయ్యాక మొక్కుబడి తంతుగా నోటీసిచ్చారు. లోపాయికారీ ఒప్పందాలతో జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు లెక్కేలేదు. అక్రమ నిర్మాణదారులకు అధికారులే తగిన అండదండలందిస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అక్రమ నిర్మాణదారులకు తగిన సలహాలిచ్చి కోర్టు ద్వారా స్టే తెచ్చుకునే ఏర్పాట్లు చేస్తారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ తరపున పనిచేయాల్సిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు సైతం అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సర్కిల్‌లో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అక్రమ నిర్మాణదారుల కోసం తన సహాయకుడి ద్వారా కోర్టు స్టే కోసం పిటిషన్ వేయిస్తారని, ఫైల్ బెంచి మీదకు వచ్చినప్పుడు జీహెచ్‌ఎంసీ తరపున పనిచేసి స్టే రాకుండా చేయడానికి బదులు అక్రమార్కులకు సహకరిస్తారనే ప్రచారం ఉంది.
ఎక్కడ పడితే అక్కడ...
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. షాపూర్‌నగర్ సంజయ్‌గాంధీనగర్ నల్లపోచమ్మ ఆలయం పక్కనే సుమారు 98 గజాల్లో ఏకంగా జీ ప్లస్ 3 నిర్మాణం జరుగుతోంది. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. అదే విధంగా జీడిమెట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ముందే ప్రధాన రోడ్డుకు ఆనుకుని 50 గజాల్లో జీప్లస్–3 నిర్మాణం, దాని పక్కనే పాత భవనాలపై కూడా కొత్త నిర్మాణాలు వెలవడం విశేషం. ఈ అక్రమ నిర్మాణాలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
ఫిర్యాదు చేసినా స్పందన లేదు...
అమీర్‌పేట: .అమీర్‌పేట, సనత్‌నగర్ డివిజన్‌లలో స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, అనుచరులు సైతం బిల్డర్ల అవతారమెత్తి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.100 నుండి 200 చదరపు అడుగుల గజాల్లో ఏకంగా 5 నుండి 6 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందిని, పైపెచ్చు ఫలానా వారు ఫిర్యాదు చేశారని అక్రమార్కులకు సమాచారమిస్తుండటంతో వారు ఫిర్యాదుదారులను బెదిరిస్తూ ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం ఉంది. అమీర్‌పేట శివ్‌భాగ్, వెంకటేశ్వర దేవాలయం, ఈడబ్ల్యూ కాలనీ,ఎస్‌ఆర్‌నగర్,బల్కంపేట బీకేగూడ, తదితర ప్రాంతాల్లో 60 అడుగుల రోడ్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
పాతబస్తీలో ఇష్టారాజ్యం..
దూద్‌బౌలి: పాతబస్తీలో అక్రమ నిర్మాణాల గురించి టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ, నిర్మాణదారులతో కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారు. సర్కిల్–9 పరిధిలోని 19, 20, 21 వార్డుల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మురళీనగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదంతస్తుల భవననిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వార్డునెంబర్ 19లో సెల్లార్ తవ్వి నిర్మాణాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment