సులువుగా గుర్తించొచ్చు
- జీహెచ్‌ఎంసీ వాహనాలకు బోర్డులు
- వారంలో 4 రోజులు కూల్చివేతలు
సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసీ వాహనాలకు ఇకపై బోర్డులు కనిపించబోతున్నాయి. ఇక్కడ చెత్త తరలింపునకే 500కు పైగా వాహనాలు ఉన్నాయి. మలేరియా నిర్మూలన, విపత్తుల నివారణ, టౌన్‌ప్లానింగ్... ఇలా వివిధ విభాగాల్లో వేయికి పైగా వాహనాలు ఉ న్నాయి. ఏవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు. వాటిని ఏఏ పనులకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల ప్రయాణాల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు సైతం ఏవి ఎక్కడ ఉంటున్నాయో తెలియదు.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని వాహనాలపైనా అవి జీహెచ్‌ఎంసీవని తెలిసే విధంగా పెద్ద బోర్డులు అమర్చుతున్నారు. ఉదాహరణకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఉపకరణాలు, సిబ్బంది ఉండే వాహనాలకు అది పారిశుద్ధ్య విభాగానికి చెందిన వాహనమని తెలిసేలా బోర్డులు అమర్చుతున్నారు. త్వరలో జీపీఎస్‌ను కూడా వినియోగించుకోనున్నారు.
అంతేకాదు.. 24 గంటల పాటు పని చేసే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్(040- 21 11 11 11)ను కూడా బోర్డుపై పేర్కొంటూ, ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చునని సూచిస్తున్నారు. దీనివల్ల చూడగానే అవి జీహెచ్‌ఎంసీ వాహనాలని, సంబంధిత విభాగానికి చెందినవని ప్రజలకు తెలుస్తాయని కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. అధికారులు వినియోగించే అద్దె వాహనాలపై కూడా (ప్రభుత్వ వాహనం తరహాలో) అది జీహెచ్‌ఎంసీ వాహనమని తెలిసేలా చిన్న అక్షరాలతో రాయనున్నారు.
వివిధ విభాగాలతో సమన్వయం..
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు గ్రేటర్‌లోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కమిషనర్ చెప్పారు. ట్రాఫిక్, జలమండలి, విద్యుత్... ఇలా విభిన్నవిభాగాల సహకారం, సమన్వయంతోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 142 నీటి నిల్వ ప్రాంతాల గురించి తమ ఇంజినీర్లకు వివరాలు అం దజేశామన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. దాదాపు 150 ప్రదేశాల్లో రహదారుల మరమ్మతుల విషయమై ట్రాఫిక్ విభాగం నుంచి వివరాలు అందాయని, వాటి మరమ్మతులూ చేస్తామన్నారు.
నెల రోజుల గడువు
గ్రేటర్‌లో ‘మన ఊరు- మన ప్రణాళిక’ అమలుకు ప్రభుత్వానికి నెల రోజుల గడువు కోరినట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్‌లో మూడు జిల్లాలు ఉన్నందున ముగ్గురు అధికారులు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. ముగ్గురూ సమన్వయంతో ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది. వర్షాలు ప్రారంభమైనందు న తగిన సమయం తీసుకొని అవసరమైన విధి వి ధానాలు రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
నిరంతరం కూల్చివేతలు
అక్రమ భవనాల కూల్చివేత నిరంతర ప్రక్రియ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇందుకు తగిన ప్రణాళికను రూపొందించామన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు కూల్చివేతలు జరుగుతాయి. మంగళ, బుధ, గురు, శని వారాల్లో కూల్చివేతలు కొనసాగిస్తామన్నారు.
ఈ నాలుగు రోజుల్లో ప్రతి జోన్‌లోని ఏదో ఒక సర్కిల్‌లో కూల్చివేతలు ఉంటాయన్నారు. తమ దృష్టికి వచ్చిన అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతర సమస్యలపై కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు వ్యవహరించనున్నట్లు కమిషనర్ చెప్పారు. నిబంధనల మేరకు తగుచర్యలు తీసుకోవచ్చునని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చట్టపరమైన వివాదాలు లేకుండా ఉండేందుకు ఆయన సలహా తీసుకుంటున్నామన్నారు.