సాక్షి, సిటీబ్యూరో : నగరాన్ని క్లీన్‌గా ఉంచాల్సిన జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం అవినీతి కంపు కొడుతోంది. ఈ విభాగంలో నిధుల దుబారా అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది. వ్యవస్థను సరిదిద్దడంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తాజాగా ‘స్పెషల్ ఆఫీసర్ల’ను నియమించారు. ఈ స్పెషల్ ఆఫీసర్లు తమకప్పగించిన సర్కిల్‌లో ప్రతి రోజూ క్షేత్రస్థాయి తనిఖీలు చేయడంతో పాటు కార్మికుల హాజరునూ, విధుల్లో ఉన్న వారి వివరాలనూ పరిశీలించాల్సి ఉంది. దాంతోపాటు రోడ్లను ఊడ్చిందీ లేనిదీ పర్యవేక్షించడం.. చెత్త డబ్బాలనుంచి చెత్తను ఎప్పటికప్పుడు తరలించే పనులు సవ్యంగా జరిగేలా చూడాలి.
ఈ విధానం వల్ల పరిస్థితిలో మార్పు రాగలదని అంచనా వేస్తున్నారు. కానీ.. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. జీహెచ్‌ఎంసీ స్వీపింగ్ యూనిట్లలో ఉండాల్సినంతమంది కార్మికులు లేకుండానే నిధులు భోంచేస్తున్నారనే కారణంతో గతంలో ఉన్న కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేశారు. పనిచేసే కార్మికుల పేరిటే కొత్త యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. బినామీ కార్మికులను అరికట్టేందుకు ఓఎస్సార్టీ.. బయోమెట్రిక్ హాజరు.. తదితరమైనవెన్నో ప్రవేశపెట్టారు. కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసినందున.. గ్రూపులుగా ఏర్పాటైన కార్మికులకే వేతనాలను నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు.
అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగంలో నిధుల స్వీపింగ్ ఆగలేదు. కాంట్రాక్టర్లు పోయినా కాంట్రాక్టర్ల మనుషులే గ్రూపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలో వేతనాలు నేరుగా వేస్తున్నా ఏటీఎం కార్డులు కాంట్రాక్టర్ల మనుషుల వద్దే ఉంటున్నాయి. 18 మంది నుంచి గ్రూపు సభ్యులను ఏడుగిరికి తగ్గించినా.. విధులకు డుమ్మాలు.. విధుల్లో లేనివారికి వేతనాలందడం జరుగుతూనే ఉంది. 18 మంది కార్మికులున్నప్పుడు నలుగురైదుగురు డుమ్మాలు కొడితే ప్రస్తుతం ఒకరిద్దరు విధుల్లో ఉండటం లేదు.
అంతేకాదు గతంలోనూ రాత్రివేళల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతల్ని సర్కిళ్ల వారీగా ఉన్నతాధికారులకు అప్పగించారు. కొద్దిరోజుల పాటు ఫలితమిచ్చిన ఆ ప్రయోగం.. అనంతరం మరుగున పడింది. పారిశుధ్య కార్మికుల హాజరు.. రోడ్లను ఊడ్చినట్లుగా స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతకాలు తీసుకునే విధానం ఉంది. అయినప్పటికీ దుబారా ఆగలేదు. చె త్త తరలింపు పనులకు అదనపు వాహనాలు అద్దెకు తీసుకున్నా.. వాటివల్ల జీహెచ్‌ఎంసీలోని కొందరికి ప్రయోజనం కలిగిందే తప్ప.. పనుల్లో పెద్ద తేడా కనిపించలేదు. స్వీపింగ్ యూనిట్లు.. బోగస్‌లు.. తదితర వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కార్మిక నేతల నుంచి ఉన్నతాధికారుల వరకు ఁఅవినాభావ సంబంధాలురూ. ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే.
ఫలితమివ్వని జరిమానాలు
పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండేందుకు రహదారులపై చెత్త వేస్తే జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వందరోజల ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు.. కార్పొరేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో ఈ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అయినప్పటికీ ప్రజల్లో మార్పు కనిపించలేదు. అధికారులు తనిఖీలు చేసిన సందర్భాల్లో రోడ్లపై చెత్తను గుర్తించి.. వాటిని వేసిన వారికి విధించిన జరిమానాలు సైతం తక్కువేమీ లేవు. 2012 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇలా వసూలు చేసిన జరిమానా రూ. 1,20,32,342. అయినా రోడ్లపై చెత్త వేసేవారు వేస్తూనే ఉన్నారు. రహదారులు అపరిశుభ్రతతో అల్లాడుతూనే ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది
Published Sun, Nov 10 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement