‘గ్రేటర్’లో అదనం
- ‘సర్వే’లో మరికొన్ని అంశాలు
- వెబ్‌సైట్‌లో నమూనా ఫారం
- భవనం వివరాలు.. పెంపుడు కుక్కల సమాచారమూ తెలపాల్సిందే
- నల్లా కనెక్షన్ వివరాలూ ఇవ్వాలి
- బీపీఎస్ కుటుంబాలు మరింత జాగ్రత్తగా ఉండాలి
- ‘సాక్షి’తో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న ఇంటింటి సర్వేలో భాగంగా గ్రేటర్ ప్రజలు అదనంగా మరికొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నగరంలో నెల కొన్న పరిస్థితుల దృష్ట్యా ఆస్తిపన్ను, నల్లా కనెక్షన్ వంటి అంశాలు సైతం తెలిసేందుకు వీలుగా గ్రేటర్ అధికారులు వాటిని పొందుపరుస్తున్నారు. తద్వారా అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లు.. ఆస్తిపన్ను చెల్లించనివారు.. తదితర వివరాలు సైతం తెలియనున్నాయి. వీటితో పాటు నివాస గృహానికి అనుమతి పొంది, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల గుట్టూ రట్టు కానుంది. అక్రమాలకు కళ్లెం వేయడంతో పాటు నిజంగా అర్హులైన వారికి మరింత సమర్థంగా సంక్షేమ పథకాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. త్వరలో సర్వే జరుగనున్న నేపథ్యంలో నగర ప్రజలు అందించాల్సిన అదనపు వివరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు తదితర అంశాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వెబ్‌సైట్‌లో సర్వే ఫారం
సమగ్ర సర్వే ఫారంలో ఏయే అంశాలున్నాయి? వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు ఎలా? అప్పటికప్పుడు అవసరమైన సమాచారం తెచ్చేదెలా? వంటి ప్రశ్నలు నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సర్వే ఫారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. దీంతో పాటు కరపత్రాల ద్వారానూ తగిన సమచారం అందిస్తామన్నారు. సర్వేపై ప్రజలకెలాంటి సందేహాలు ఉన్నా... నివృత్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
కాల్ సెంటర్ ద్వారా సాయం
సర్వే ప్రశ్నావళికి సంబంధించి ప్రజల సందేహా ల నివృత్తికి జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ సిబ్బం దికి అవసరమైన శిక్షణ ఇస్తామని కమిషనర్ చె ప్పారు. తద్వారా ప్రజల సందేహాలకు వారు సమాధానాలు చెబుతారన్నారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ 040-21 11 11 11కు ఫోన్‌చేసి ప్రజలు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని చెప్పారు. ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది.
బీపీఎల్ కుటుంబాలూ.. తస్మాత్ జాగ్రత్త
గ్రేటర్‌లోని బీపీఎల్ కుటుంబాల వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. లేదా ప్రస్తుతం పొందుతున్న పథకాల నుంచి తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకే సరైన వివరాలు అందజేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా తమ వివరాలను అందజేయాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివన్నీ జిరాక్స్‌లు తీయించుకొని ఉండటం మేలు. వీటితో పాటు బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలు ఉంటే వాటి నెంబర్లు తెలియజేయాలి. గ్యాస్ కనెక్షన్లు, దీపం పథకం ప్రయోజనం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంది. అంతేకాదు..భవిష్యత్‌లో జీహెచ్‌ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాలు అమలు చేయబోయే సంక్షేమ పథకాలన్నింటికీ వీటితో పోల్చి చూస్తారు.
ఎక్కడి వారు అక్కడే
ఎక్కడ ఉంటున్న వారు అక్కడే తమ వివరాలు నమోదు చేయించాలి. ఉదాహరణకు నగరంలోఉండేవారు ఇక్కడే పేర్లు నమోదు చేయిస్తే.. భవిష్యత్‌లో అమలయ్యే సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు పొం దాలనుకునేవారు (ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నవారు) అక్కడే తమ వివరాలివ్వాలి. తద్వారా అక్కడ పథకాలు పొం దే వీలుంటుంది. నగరంలో ఉంటున్న తమకు గ్రామాల్లో భూములు ఉన్నాయంటున్న వారు..ఎక్కడ నివాసం ఉంటా రో..పథకాలను వినియోగించుకోవాలనుకుంటారోఅక్కడే వివరాలు అందజేయాలి.
తప్పనిసరిగా విధులకు వెళ్లాల్సిన వారు.. ఇంట్లో ఉండటం వీలుపడని వారికి (ఆస్పత్రుల్లో చికిత్సలో ఉన్నవారు.. ఇంటర్వ్యూలకు ఇతర ప్రదేశాలకు వె ళ్లినవారు తదితరులు) సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే ఫారంలోని ‘రిమార్కులు’ కాలమ్‌లో వాటిని పొందుపరుస్తారు.
భార్య లేక భర్త నగరంలో ఉండి.. మిగతా వారు ఇతర ప్రదేశం(వేరే జిల్లా,గ్రామం)లో ఉంటే అక్కడే నమోదు చేయించుకుంటే మంచిదని కమిషనర్ తెలిపారు. నగరంలో తాత్కాలిక నివాసం ఉండేవారు వారి స్వగ్రామాల్లో వివరాలు నమోదు చేయిస్తేనే స్థానికంగా సంక్షేమ పథకాలకు అర్హులవుతారన్నారు.
విదేశాల్లో ఉంటున్న వారికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబీకులు తెలియజేయవచ్చు.
గ్రేటర్ ప్రజలు అదనంగా పొందుపరచాల్సిన అంశాలివీ...
1. భవనం/ఇల్లు ఆస్తిపన్నుకు సంబంధించిన(పీటీఐఎన్) నెంబరు.
2. జలమండలి నుంచి నల్లా కనెక్షన్ ఉందా? ఉంటే క్యాన్ నెంబరు.
3. భవనంలో ఎన్ని అంతస్తులున్నాయి?
4. నివాస భవనమా.. వాణిజ్య భవనమా?
5. కొన్ని అంతస్తుల్లో నివాసాలుండి.. కొన్ని అంతస్తుల్లో వాణిజ్యం జరుగుతోందా?
6. కుక్కలు, ఇతర పెంపుడు జంతువుల వివరాలు.