సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికోసం వివిధ విభాగాల నుంచి సిబ్బందిని కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం, సర్వేకు కావాల్సిన యంత్రాంగం కొరత తదితర అంశాల నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమం సాగదనే సంశయాలు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు వీలునుబట్టి అదే రోజున లేదా మరో తేదీన గ్రేటర్ నగరంలోనూ సామాజిక ఆర్థిక సర్వేకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. వీలైతే ఒకే రోజున.. లేదా రెండు రోజుల పాటు సర్వే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు అవసరమైన యం త్రాంగం, సర్వేలో ఎవరెవరిని వినియోగించుకోవాలి? ఏయే అంశాలు పొందుపరచాలనే విషయమై జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీతో పాటు నగరంలోని వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, పోలీసులు, మిలటరీ బలగాలనూ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు.
సర్వే విధానంపై కసరత్తు
సుమారు 625 చ.కి.మీల మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీ ప్రస్తుత జనాభా 90 లక్షలు దాటింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని సుమారు కోటి మంది వివరాలను సేకరించేందుకు లక్ష మంది అవసరమవుతారని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కొక్కరు సగటున 25 ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. నగరంలో చిరునామాలు గందరగోళంగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, సర్వేకు ఎలాంటి విధానాన్ని పాటించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వారీగా సర్వే జరపాలనే అభిప్రాయాలతో పాటు జనగణన సమయంలో పాటించిన ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ పరిశీలనకు వచ్చాయి.
ఎన్యూమరేషన్ బ్లాకుల వారీగా అయితే శాస్త్రీయంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ బ్లాకుల మ్యాపులు ఉన్నందున పని సులువవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు జీహెచ్‌ఎంసీలోని ఆస్తి పన్ను విభాగం, అంగన్‌వాడీల సేవలూ వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నా...వాటి వల్ల తగిన ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నివిధాలా యోగ్యమైన విధానం కోసం ఒకటి రెండు రోజుల పాటు ఆలోచనలు సాగే అవకాశం ఉంది.
పూర్తయితే స్టిక్కర్లు
సర్వే పూర్తయిన ఇళ్లకు సంబంధించి ఈ విషయం తెలియజేసేలా స్టిక్కర్లు అతికించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ స్లిప్‌ల పంపిణీలోనూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ విధానాన్ని పాటించారు. ఓటరు స్లిప్పులు అందజేసిన వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఆ అనుభవంతో ఈసారి మరింత పకడ్బందీగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని అమలు చేయగలమని భావిస్తున్నారు. సర్వే విధుల్లో పాల్గొనే లక్ష మందిపై వివిధ స్థాయిల్లో సూపర్‌వైజర్లు, ఇన్‌ఛార్జులను నియమించనున్నారు. తమ పరిధిలో సర్వే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అవసరమైన చర్యలు చేపడతారు.
అక్షరాలా లక్షమంది!
Published Sun, Aug 3 2014 2:13 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement