‘మెట్రోపోలీస్’ ఏర్పాట్లపై సమీక్ష | 'Metropolis' arrangements for the review of the | Sakshi
Sakshi News home page

‘మెట్రోపోలీస్’ ఏర్పాట్లపై సమీక్ష

Published Fri, Jul 4 2014 12:58 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

'Metropolis' arrangements for the review of the

సాక్షి, సిటీబ్యూరో: వచ్చే అక్టోబర్‌లో జరుగనున్న మెట్రోపోలీస్ సదస్సును పురస్కరించుకొని 150 కిలోమీటర్ల మేర రహదారి మార్గాలను అభివృద్ధి పరచనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సదరు మార్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ప్రతిపాదనలందజేయాల్సిందిగా హెచ్‌ఎంఆర్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు. మెట్రోపోలీస్ సదస్సు ఏర్పాట్లపై గురువారం జీహెచ్‌ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు పర్యటించే పర్యాటకప్రదేశాలు, షాపింగ్ ప్రాంతాలు, సదస్సు వేదిక తదితర ప్రాంతాలతో సహా 150 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులను పొందేందుకు ఈనెల 6లోగా ప్రతిపాదనలందజేయాలన్నారు.    

సెప్టెంబర్ 15లోగా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు డిఫెక్ట్ లయబిలిటీ వర్తిస్తుందని చెప్పారు. సీఓపీ సదస్సు సందర్భంగా చేపట్టిన పనుల్ని పునరుద్ధరించడంతోపాటు 125 కి.మీ. మేర రహదారి మార్గాలను సీజనల్  ఫ్లవర్స్ మొక్కలతో తీర్చిదిద్దాలని సూచించారు.

జూబ్లీహిల్స్ రోడ్డునెం.36 పై శ్రద్ధ వహించాల్సిందిగా హెచ్‌ఎంఆర్ అధికారులను కోరారు. చారిత్రక ప్రదేశాల్లో రంగులు మారే ప్రత్యేక వీధిదీపాలు ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ కమిషనర్ రోనాల్డ్‌రాస్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement