అంతా వాస్తు మేరకే..!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆధునికతకు పూర్తి స్థాయి వాస్తును జోడించి తయారు చేసిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాజధానిలోని ప్రతి కట్టడం, ప్రతి రోడ్డును వాస్తు ఆధారంగానే డిజైన్ చేశారు. ఐదు నెలల క్రితం సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు రూపొందించిన ప్లాన్‌కు ప్రభుత్వం అనేక మార్పులు చేయగా అందులో వాస్తు మార్పులే అత్యంత కీలకం! ప్రాచీన వాస్తు సూత్రాలకనుగుణంగా ప్లాన్ మొత్తాన్ని తయారు చేశారు. రాజధాని నగరంతోపాటు ప్రధాన రోడ్ల ఎలైన్‌మెంట్‌ను ఉత్తర-దక్షిణ దిక్కుకు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రోడ్డు గ్రిడ్‌ను ఇదే వాస్తు సూత్రాల ప్రకారం దీర్ఘచతురస్రాకారంగా రూపొందించారు.
ఉత్తరం నుంచి దక్షిణం వైపు వీచే గాలుల్లో పాజిటివ్ శక్తి ఉంటుందనే వాస్తు సూత్రం ఆధారంగా ఈ ప్రణాళిక తయారైంది. విజయవాడ నుంచి రాజధాని నగరంలోకి ప్రవేశించేమార్గం ఉత్తర-దక్షిణ కారిడార్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వాస్తు నిబంధనల ప్రకారం బ్రహ్మస్థానంలో (కేంద్రం) సెంట్రల్ గ్రీన్ హబ్‌ను ప్రతిపాదించారు. ఉత్తర-దక్షిణ దిశలోనే కొండపల్లి, నీరుకొండ కొండల బ్యాక్‌డ్రాప్‌లో అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. రిక్రియేషన్ కార్యకలాపాలు, వాటర్‌ఫ్రంట్ కమర్షియల్ కేంద్రాన్ని ఈ దిక్కునే ఏర్పాటు చేస్తున్నారు. జులై 20వ తేదీన సింగపూర్ ఇచ్చిన ప్లాన్‌కు జల వనరులు, రోడ్డు గ్రిడ్, వరద నిర్వహణ, వేస్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు పలు అదనపు ఆకర్షణలను జోడించారు. ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో ప్రభుత్వ భవనాల సముదాయం, వర్సిటీ, సీడ్ రాజధానిలో పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల అభివృద్ధిని పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థ: ప్రైవేటు వాహనాలను నియంత్రించి పబ్లిక్ రవాణా వ్యవస్థపై జనం ఆధారపడే రవాణా వ్యవస్థను ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతానికి ప్రత్యేకంగా రోడ్డు గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు, తొమ్మిదో నెంబరు జాతీయ రహదారులను రాజధానికి కలుపుతూ రెండు అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాలను ఈ గ్రిడ్‌లో నిర్మిస్తారు. నగరంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ మేజర్ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కలెక్టర్ రోడ్లను నిర్మించనున్నారు.
మొత్తం ఐదు బీఆర్‌టీ రోడ్డు లైన్లతో రాజధాని మొత్తాన్ని కవర్ చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ రోడ్లపైనే నాలుగు మెట్రో రైల్ కారిడార్లను రెండు దశల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. విజయవాడను కలుపుతూ నిర్మించే మొదటి దశ రెండు మెట్రో కారిడార్లను అత్యంత ప్రధానమైన కారిడార్లుగా పేర్కొని పదేళ్లలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. హైస్పీడ్ రైలు కారిడార్‌ను రాజధాని గుండా నిర్మించే విషయాన్ని ప్లాన్‌లో పేర్కొన్నారు. వరద నిర్వహణ, కాలుష్య నియంత్రణ, వర్షపునీటి వినియోగం, ఇంటిగ్రేటెడ్ అర్బన్ వాటర్ మేనేజ్‌మెంట్, సీవరేజ్ ట్రీట్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, త్రాగునీటి సరఫరాకు ప్రత్యేక వ్యూహాలను పేర్కొన్నారు.