జూన్‌లో మెట్రో పరుగులు
⇒ తొలుత మియాపూర్–ఎస్‌ఆర్ నగర్ రూట్లో రాకపోకలు
⇒ తేదీ, ముహూర్తంపై సర్కారుదే తుది నిర్ణయం
⇒ ఆగస్టులో నాగోల్–బేగంపేట్ రూట్ ప్రారంభం
⇒ 2018 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. జూన్‌లో మియాపూర్–ఎస్‌ఆర్ నగర్(11 కి.మీ) మార్గంలో మెట్రో పరుగులు పెట్టనుందని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే మెట్రో ప్రారంభ తేదీ, ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. నాగోల్–బేగంపేట్(16 కి.మీ) మార్గంలో ఒలిఫెంటా బ్రిడ్జి, ఆలుగడ్డబావి రైలు ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాన్ని పూర్తిచేసి ఆగస్టులోనే ఈ రూట్లోనూ మెట్రో రైలు పరుగులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నాటికి నాగోల్– హైటెక్ సిటీ(27 కి. మీ), ఎల్బీ నగర్–మియాపూర్(29 కి.మీ) మెట్రో మార్గాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
శనివారం మీడియా ప్రతినిధులతో కలసి మెట్రో రైలు ఓవర్ బ్రిడ్జీ పనులను సందర్శించిన సందర్భంగా ఎన్వీ ఎస్ రెడ్డి మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మెట్రో ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.
బేధాభిప్రాయాలు లేవు..: మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి బేధాభి ప్రాయాలు లేవు. ప్రాజెక్టు 2017 జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. ఏడాది ఆలస్యమైంది. దీనివల్ల పెరిగే నిర్మాణ వ్యయాన్ని ఎవరు భరించాలన్న అంశాన్ని ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్ ఎల్ బోర్డు, ప్రభుత్వం నిర్ణయిస్తాయి. కాంట్రాక్టు సమస్యలు, నిర్మాణ ఒప్పందంలో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. ఎన్నికష్టాలైనా ఎదుర్కొని ప్రాజెక్టును పూర్తిచేస్తాం. –ఎన్వీఎస్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్