అపరాధ రుసుం దందా రూ.20 కోట్లపైనే
రెచ్చిపోతున్న అక్రమార్కులు
పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
టౌన్‌ప్లానింగ్ విభాగంలో ‘ఫైన్’ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనధికారిక కట్టడాలపై ఎక్కు పెట్టిన జరిమానా అస్త్రం గురి తప్పుతోంది. నగరపాలక సంస్థ ఖాతాలో అరకొర ఆదాయం జమ అవుతుండగా అక్రమార్కుల పంటపండుతోంది. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటడంతో ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్నాయి.
విజయవాడ సెంట్రల్ : నగరంలో అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గతంలో నిర్మాణం చేసిన అక్రమ కట్టడాల నుంచి మార్కెట్ విలువలో పదిశాతం మేర అపరాధ రుసుం వసూలు చేయాల్సిందిగా నాలుగు నెలల క్రితం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. అందుకు పూర్తి విరుద్ధంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 14వ డివిజన్ భూపేష్ గుప్తానగర్‌లో అక్రమ నిర్మాణం విషయమై బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఆషా, లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని, అందులో కొంత మొత్తమే చెల్లించడంతో ఇంటిని కూల్చివేసిందని, అదేమని ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేసిందని లక్ష్మీరాజ్యం ఫిర్యాదు చేసింది. తన విధులకు ఆటంకం కలిగించిందంటూ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కౌంటర్ కేసు పెట్టారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.
దోచేయ్..
భవానీపురం, పటమట, గవర్నర్‌పేట, సత్యనారాయణపురం, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి టౌన్‌ప్లానింగ్ అధికారులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం పదిశాతం ఫీజు కట్టించాలనే ప్రతిపాదన పక్కన పెట్టేశారు. నామమాత్రంగా ఫైన్ కట్టించి భారీగా ముడుపుల తీసుకుంటున్నారు. భవానీపురం, సత్యనారాయణపురం, గవర్నర్‌పేట ప్రాంతాల్లో రూ.లక్షల మొత్తంలో బేరాలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. సింగ్‌నగర్‌లో 62 గజాల స్థలంలో రెండో అంతస్తు కావాలంటే ఫైన్ రూ.20 వేలు, మామూళ్ల కింద రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మూడు నెలలుగా అధికారులు వసూలు చేసిన అపరాధ రుసుం మొత్తం రూ.2 కోట్లు ఉంటే అవినీతి అధికారులు మాత్రం రూ.20 కోట్ల మేర వెనకేసుకున్నట్లు సమాచారం.
నిఘా ఏది ?
విజిలెన్స్, ఏసీబీ అధికారులు మూడు నెలలకోసారి టౌన్‌ప్లానింగ్‌పై మొక్కుబడి విజిట్‌లతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పేట్రేగిపోతున్నాయని, దీనికి ఆన్‌లైన్‌తో కళ్లెం వేస్తానని మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అవినీతి రాయుళ్లు ఆలోచలో పడ్డారు. వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చిన ఫైన్ మంత్రంతో దోచేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫైన్ వసూలు చేసినంత మాత్రన అవి రెగ్యులర్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. భవిష్యత్‌లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్) స్కీం అమలైతే మళ్లీ సొమ్ములు చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థలో సాగుతున్న దోపిడీపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.