♦ ప్రభుత్వానికి సరెండర్ చేసిన కమిషనర్
♦ టౌన్ ప్లానింగ్ విభాగం గదికి తాళం
తాండూరు : స్థానిక మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి (టీపీఓ)కు చుక్కెదురైంది. పక్షం రోజుల అనంతరం తిరిగి విధుల్లో చేరాలనే టీపీఓ ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రితం రోజు విధులో చేరడానికి మున్సిపల్ మేనేజర్ శ్రీహరికి ఇచ్చిన లేఖను మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ శనివారం తిరస్కరించడంతోఆమెకు భంగపాటు తప్పలేదు. ఏడాది క్రితం ఇక్కడ టీపీఓగా శైలజ విధుల్లో చేరారు. అయితే పట్టణంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుండడం, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై గత నెల 30న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు చర్యలకు డిమాండ్ చేశారు.
ఈ మేరకు టీపీఓను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సంతోష్‌కుమార్ రెండు రోజుల క్రితం ఆమెను సరెండర్ చేస్తున్నట్లు డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీసీ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న టీపీఓ విధులు చేరేందుకు మున్సిపాలిటీకి వచ్చారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్‌కు లేఖ అందించారు. ఈ లేఖను కమిషనర్ తిరస్కరించారు. ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీటీసీపీకి ఇచ్చిన లేఖ ప్రతిని శనివారం కమిషనర్ టీపీఓకు అందించారు.
దీంతో ఆమె కార్యాలయం నుంచి వెనుతిరిగారు. కొసమెరుపు ఏమిటంటే.. ముఖ్యమైన ఫైళ్లు గల్లంతు కావొద్దనే యోచనతో మున్సిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్ విభాగం గదికి కమిషనర్ తాళం వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్తగా ఇద్దరు బీఐలు, ఒక టీపీఎస్‌లు వస్తున్నారని చెప్పారు.