
ఆదమరిస్తే అంతే!
- మునిసిపాలిటీల్లో మార్టిగేజ్ నిబంధనలకు తిలోదకాలు
- నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు
- కీలక పాత్ర పోషిస్తున్న టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు
- కోర్టుకెక్కుతున్న వినియోగదారులు
అపార్ట్‌మెంట్లలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టౌన్ ప్లానింగ్‌లోని ‘మార్టిగేజ్’ నిబంధనలు దారి తప్పునున్నాయి. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మునిసిపాలిటీలు తనఖా చేసిన ఆస్తులను కూడా భవన యజమానులు యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుకున్నారు. వీటి కొనుగోలు తర్వాత నిజం తెలిసి విక్రయదారులు బోరుమంటున్నారు. చిత్తూరులో జరిగిన ఓ సంఘటన ద్వారా ‘మార్టిగేజ్’పై ఆరా తీస్తే.. ప్రతి జిల్లాలోనూ అక్రమాలు బయటకొస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.
సాక్షి, చిత్తూరు: కార్పొరేషన్, మునిసిపాలిటీల తనఖాలోని భవన సముదాయాలను సంబంధిత యజమానులు రిజిస్ట్రేషన్ అధికారులతో లాలూచీపడి ఇంకొకరికి విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. మార్టిగేజ్ చేసిన బహుళ అంతస్తుల సముదాయాలలోని ప్లాట్లు క్రయవిక్రయాలు చేయకుండా మునిసిపల్ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖ వారికి సంబంధిత రికార్డులు ముందస్తుగా సమర్పిస్తారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు ఉద్యోగులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తనఖాతాలో ఉన్న ఆస్తులను మునిసిపాలిటీ నుంచి అనుమతి జారీ(క్లియరెన్స్) ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ శాఖ తద్భిన్నంగా వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మునిసిపాలిటీ తనఖాలోని ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడంతో ఆలస్యంగా ఈ విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.
మార్టిగేజ్ నిబంధనలు ఇవీ
అపార్ట్‌మెంట్లలో నిర్మాణంలో అక్రమాలను నిలువరించడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 569ని విడుదల చేసింది. దీని ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేసేవారు 10 శాతం స్థలాన్ని పురపాలకశాఖకు రిజిస్ట్రేషన్‌తో సహా అప్పగించడమే మార్టిగేజ్ ! అపార్ట్‌మెంట్ల యజమానులు నిబంధనలు పాటింకపోతే మార్టిగేజ్ చేసిన స్థలాన్ని మునిసిపాలిటీ అధికారులు తనఖా విడిపించరు. తద్వారా అక్రమాలను నియంత్రించాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం! కాగా ఆచరణలో మాత్రం ఇది విఫలమవుతోంది. అనంత పురం, తిరుపతి, కడప, కర్నూలు, చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లి, ప్రొద్దుటూరు, నంద్యాల, హిందూపురం లాంటి మునిసిపాలిటీల పరిధిలో మార్టిగేజ్ క్లియరెన్స్ చేసుకున్న అపార్ట్‌మెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మార్టిగేజ్ క్లియరెన్స్ లేకుండానే చాలా అపార్ట్‌మెంట్లు ఉండటం గమనార్హం.
అక్రమ రిజిస్ట్రేషన్‌లతో..
మునిసిపాలిటీకీ మార్ట్‌గేజ్ చేసిన పలు అపార్ట్‌మెంట్లులోని ప్లాట్లను సదరు కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారు. చిత్తూరు చర్చిరోడ్‌లో ఇటీవల ఓ సంఘటన వెలుగులోకి వచ్చి విక్రయదారుడు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీంతో తిరిగి యజమాని, అధికారులు సదురు వ్యక్తిని పిలిచి పంచాయతీ చేశారు.
-తిరుపతిలో మార్ట్‌గేజ్ నిబంధనలను అతిక్రమించి క్రయవిక్ర యాలు కోకొల్లలుగా జరిగాయి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ శాఖలోని ఇద్దరు ఉద్యోగుల కనుసన్నల్లోనే సాగాయి. కొన్నేళ్లుగా ఆశాఖలో పాతుకుపోయిన వీరు టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి ఈ అక్రమాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గత ఏడాది మునిసిపాలిటీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో కూడా బట్టబయలైంది.
- అనంతపురంలోని సుభాశ్‌రోడ్డు, రాంనగర్ కాలనీల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విక్రయాలు జరిపారు. దీనిని గుర్తించిన సదరు ప్లాట్ల యజమానులు తమకు జరిగిన నష్టంపై న్యాయవాదులతో నోటీసులు సైతం ఇప్పించారు.
- కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తిరుపతిలో అధికశాతం అపార్ట్‌మెంట్లు మార్ట్‌గేజ్ నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎన్‌ఫోర్స్‌మెంట్ దష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. వీటిపై గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినా అక్రమాలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు.
నిబంధనలు బేఖాతర్
- పూర్తి స్థాయిలో సెట్‌బ్యాక్ 12 మీటర్లు వదలకుండానే అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.
- పార్కింగ్ స్థలంలో దుకాణాలు నిర్మించుకుని అద్దెలకు ఇస్తున్నారు. ఇది ప్రతీ మునిసిపాలిటీలోనూ సాధారణమైపోయింది.
- పురపాలకశాఖ అధికారులు నిర్మాణాలను ప్రాథమిక దశలో అడ్డుకోకుండా పూర్తిగా నిర్మాణాలు చేసిన తర్వాతే మేల్కొంటున్నారు. తర్వాత అందినకాడికి పుచ్చుకుని నిమ్మకుండిపోతున్నారు.
- చిత్తూరు చర్చిస్ట్రీట్‌లో 90శాతం షాపింగ్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ స్థలాలు లేవు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా ఉంచి వెళుతున్నారు. కార్లలో షాపింగ్ వస్తే అంతే సంగతి. వీటి నిర్మాణ అనుమతులు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే! ఇటీవల చిత్తూరులో 20రోజుల పాటు ట్రాఫిక్ అధికారులు దుకాణదారులతో పాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు. అయినా కార్పొరేషన్ సిబ్బంది స్పందించలేదు. కడప వైవీస్ట్రీట్‌లోనూ అచ్చం ఇదే పరిస్థితి.
- కర్నూలులోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో సూపర్‌మార్కెట్ నిర్మించారు. దీనిపై వివాదం న్యాయంస్థానం వరకూ వెళ్లింది.
- అనంతపురం కార్పొరేషన్‌లో సుభాశ్‌రోడ్డులో నగరంలోనే పేరుమోసిన ఓఅపార్ట్‌మెంట్ ముందుభాగంలోని షాపింగ్ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేదు.
- అనంతపురంలో గుత్తిరోడ్డులోని మునిసిపాలిటీ కాలువను ఓ ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే పూర్తిగా పూడ్చి అక్కడ ఓ సముదాయాన్ని నిర్మించారు. దీంతో అక్కడ నిత్యం డ్రైనేజీ సమస్య తలెత్తుతోంది.