కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు 66 రోజుల పాటు చేసిన సమ్మె విరమణ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల తాళాలు తెరుచుకున్నాయి. కీలక విభాగాలైన రెవెన్యూ, కార్పొరేషన్, రవాణా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని అన్ని శాఖల కార్యాలయాలూ ఉద్యోగులతో కళకళలాడాయి.
కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్ల సిబ్బందీ ఉదయం 10 గంటలకే విధులకు హాజరయ్యారు. రెండు నెలల పాటు సిబ్బంది విధులు నిర్వహించకపోవటంతో పేరుకుపోయిన ఫైళ్లలో ముఖ్యమైనవాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు నెలల సమ్మె కాలంలో టపాలు కుప్పతెప్పలుగా రావటంతో అటెండర్ల సహాయంతో ఆయా డిపార్టుమెంట్లుగా విడగొట్టి విభాగాధిపతులకు అందజేశారు. విజయవాడ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ, అకౌంట్స్, రెవెన్యూ తదితర విభాగాల ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.
ఫైళ్ల బూజు దులిపి పనిబాట పట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో వందల సంఖ్యలో గృహనిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. విజయవాడ, గుడివాడ, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, జగ్గయ్యపేట, నూజివీడు రవాణా కార్యాలయాల్లో రద్దీ అధికంగా కనబడింది. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల పనులపై ప్రజలు ఎగబడ్డారు. సమ్మె కారణంగా రవాణా శాఖకు రూ.20 నుంచి 25 కోట్ల నష్టం వచ్చినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకుని పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినవారు, ఫ్యాన్సీ నంబర్లు బుక్‌చేసుకున్నవారు గడువుతీరిన వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులో 2,500 దరఖాస్తులు వివిధ పనుల నిమిత్తం దాఖలైనట్లు ఆయన వివరించారు. లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. గుడివాడలో రెండు నెలల తరువాత కార్యాలయం పనిచేయటంతో ఆన్‌లైన్ ధ్రువీకరణ పత్రాలు పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆన్‌లైన్ సర్వర్లు మొరాయించాయి.
బ్యాంకులు బంద్ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలిగింది. దసరా సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు కూడా పూర్తిస్థాయిలో పనిచేశాయి. కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయం, ఖజానా శాఖ, ఆర్డీవో కార్యాలయం, సంక్షేమ శాఖల కార్యాలయాలు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలు సిబ్బంది విధులకు హాజరయ్యారు. దీంతో ఆయా శాఖల్లో ఉన్న అవసరాల దష్ట్యా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు విచ్చేశారు. సమ్మె విరమించటంతో ఆయా శాఖల్లో పనులు ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కార్యాలయాలు కళకళ
Published Sat, Oct 19 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement