సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా సులభరీతిలో వేగంగా పొందేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు పట్టణాల వైపు చూస్తున్నారని, వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు, సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం బుద్ధభవన్‌లో జరిగిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందితో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతుల కోసం రూపొందించే నూతన విధానం ప్రకారం 75 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని, 600 చదరపు గజాల్లోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం అమలు చేస్తామన్నారు.
(చదవండి : సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?: ఇంద్రసేనారెడ్డి )
600 చదరపు గజాలకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామని ప్రకటించిన కేటీఆర్, పారిశ్రామిక అనుమతుల్లో సింగిల్ విండో విధానం విజయవంతంగా అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచేలా పనిచేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు. పాత అనుమతుల విధానాన్ని పూర్తిగా మార్చి నూతన విధానం ప్రవేశ పెట్టే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురైనా వెనక్కితగ్గేది లేదన్నారు.
సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు
ప్రజలు, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి మద్దతు లభిస్తుందనే నమ్మకంతోనే నూతన విధానం తెస్తున్నామని, ఈ విధానంలోని నిబంధనలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు అనుమతులు, అక్రమ నిర్మాణాలు చేపడితే ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేతలు చేపట్టే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉందన్నారు.
నూతన విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులపైనే ఉంటుందని, అక్రమ నిర్మాణాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చే అవినీతి ఆరోపణలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని, నిజాయితీతో పనిచేసే సిబ్బందికి తమ సహకారం ఉంటుందన్నారు.
హెచ్‌ఎండీఏ ల్యాండ్ పూలింగ్ పద్ధతినే..
టౌన్ ప్లానింగ్ విభాగంలో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. ఇక ప్రతీ మున్సిపాలిటీకి ఒక మాస్టర్‌ప్లాన్‌తో పాటు, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన క్యాలెండర్‌ను తయారు చేయాలని డీటీసీపీ అధికారులను మంత్రి ఆదేశించారు. హెచ్‌ఎండీఏ అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ పద్ధతులనే రాష్ట్రంలోని ఆరు పట్టణాభివృద్ధి సంస్థలూ అనుసరించాలని సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ సీపీపీ దేవేందర్ రెడ్డి, డీటీసీపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment