ఎన్టీటీపీఎస్లో భద్రత కట్టుదిట్టం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీటీపీఎస్)లో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఆది వారం నుంచి థర్మల్ కేంద్రం మూడు గేట్ల వద్ద స్పెషల్ ప్రొటెక్ష న్ ఫోర్స్ (ప్రత్యేక పోలీసు దళం)ను నియమించారు. ఎన్టీటీపీఎస్లో నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నగర పోలీసు కమిషనర్ గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో ఇక్కడ భద్రత కోసం ఈ దళాన్ని ప్రభుత్వం నియమించింది.
ఎన్టీటీపీఎస్కు నియమితులైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆదివారం విద్యుత్ కేంద్రానికి వచ్చారు. వీరికోసం సెక్యూరిటీ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య ప్రారంభించారు. అంతకు ముందు ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్కు ప్రత్యేక రక్షణ కోసం మొత్తం 207 మంది సిబ్బంది నియమితులయ్యారన్నారు.
అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ థర్మల్ కేంద్రానికి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి, నిఘాను పెంచినట్లు చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారులు కమాండెంట్లుగా, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఇందులో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్టీటీపీఎస్లోని మూడు గేట్ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లో కోల్ విభాగంలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎన్టీటీపీఎస్లో 3500 మంది ఉద్యోగులు, రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరి వద్ద గేట్ పాస్‌లు, ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించాలని సూచిం చారు. ప్రస్తుతం నియమితులైన 207 మంది సిబ్బందిలో కొందరికి మాత్రమే క్వార్టర్ సౌకర్యం కల్పించామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీలు మాధవరావు, నాగమల్లేశ్వరరావు, పరిపాలనా విభాగం ఎస్ఈ రమేష్, ఎస్ఈ సుబ్రహ్మణ్యరాజు, ఫ్యాక్టరీ మేనేజర్ జీవకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.