అందువల్లే ఐదేళ్లలో విద్యుత్ నియంత్రణ మండలి అనేక లక్ష్యాలు సాధించింది
ఐదేళ్లలో దాదాపు 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేశాం
అవరోధాలు ఎదురైనా రైతుల కోసం ‘సెకీ’ ఒప్పందాన్ని ఆమోదించాం
అవసరం మేరకే మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లు జరిగేలా చూశాం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్‌సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక
ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
⇒ ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం.
⇒ మూడు గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్‌ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు.
⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం.
⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం.
⇒ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్ మిల్లులు, పల్వరైజర్ పరిశ్రమలకు 150 హెచ్‌పీ లోడు వరకు ఎల్‌టీ టారిఫ్ ద్వారా విద్యుత్ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్ ట్రస్ట్‌లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం.
⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం.
⇒ గృహ విద్యుత్ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్ పాయింట్ బిల్లింగ్ ప్రతిపాదనలను తిరస్కరించాం.
Comments
Please login to add a commentAdd a comment