
జగిత్యాల టౌన్: రాజవ్వ అటుకులంటే జగిత్యాలలో తెలియని వారుండరు. ఆ టేస్టుకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల పట్టణ టవర్ సర్కిల్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లో రాజవ్వ అనే మహిళ గత 25 ఏళ్లుగా రుచికరమైన అటుకులు, చాయ్ హోటల్ నిర్వహిస్తున్నారు. శుచి, శుభ్రతతో తయారు చేసిన అటుకులకు దాల్చా చేర్చి నిమ్మకాయ పిండి ఇచ్చే అటుకులకు టిఫిన్ ప్రియులు ఫిదా అవుతున్నారు.
ఉదయం నుంచే రాజవ్వ అటుకుల కోసం టిఫిన్ ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్లేట్ కేవలం రూ. 20కే అందిస్తున్న రాజవ్వ అటుకులను మార్కెట్‌కు వచ్చే కొనుగోలు దారులు, కూరగాయల అమ్మకం దారులు, వ్యాపారులు తెగ ఇష్టపడి తింటుంటారు. దేశ విదేశాల్లో కూడా రాజవ్వ అటుకుల గురించి చర్చ జరగడం ఇక్కడి అటుకుల రుచికి నిదర్శనమని పలువురు టిఫిన్ ప్రియులు చెబుతున్నారు. జగిత్యాల కూరగాయల మార్కెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది రాజవ్వ అటుకులే కావడం విశేషం. అటుకులే కాదు రాజవ్వ చేసే చాయ్ అంటే కూడా చాయ్ ప్రియులు ఎంతో ఇష్టపడి తాగుతుండటం విశేషం.
ఇంట్లో తిన్నట్లుంటుంది
రాజవ్వ చేసే అటుకులు తింటే ఇంట్లో చేసిన అటుకులు తిన్న అనుభూతి కలుగుతుంది. శుచి, శుభ్రతతో పాటు మంచి రుచితో ఉండే రాజవ్వ అటుకులంటే నాతో పాటు నా మిత్రులు ఇష్టపడతారు. మిత్రులతో కలిసి రాజవ్వ హోటల్లో అటుకులు తింటాను. – ప్రసాద్‌గౌడ్, స్థానికుడు
అటుకులు బాగుంటాయి
మాది జగిత్యాల మండలం నర్సింగాపూర్. నేను రైతును. పలు రకాల కూరగాయలు మార్కెట్‌కు తెచ్చి అమ్ముతుంటాను. రాజవ్వ హోటల్ వద్ద రుచికరమైన అటుకులు తిన్నాకే దందా మొదలు పెడతాను. రాజవ్వ చేసే అటుకులు చాలా రుచిగా ఉంటాయి. – గంగవ్వ, రైతు
Comments
Please login to add a commentAdd a comment