ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై నీలినీడలు
–పొంతన లేని అంశాలతో చిక్కులు వేసే యత్నంలో ప్రభుత్వం
- జేఎన్‌టీయూ పరిధిలో తాత్కాలికంగా నిలుపుదల
జేఎన్‌టీయూ : వర్సిటీల పరిధిలో బోధన పోస్టుల భర్తీకి నీలినీడలు కమ్ముకున్నాయి. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాల ప్రతులు వర్సిటీకి అందాయి. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో భర్తీ ఆగిపోయింది.
పొంతన లేని అంశాలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్టర్ పాయింట్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు వేర్వేరు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రోస్టర్ పాయింట్లు అవసరం లేదు. ఆయా వర్సిటీలే నేరుగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసుకునే వీలుది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్సిటీలు ఇదివరకే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నవంబర్ 2న జరిగిన పాలకమండలి సమావేశంలో ప్రతిపాదన తెచ్చారు.
ఇందుకు పాలకమండలి సైతం ఆమోదం తెలిపింది. తీర్మానాలు (రిజల్యూషన్స్) వచ్చాక నోటిఫికేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ప్రతిబంధకంగా మారాయి. కామన్ రిక్రూట్‌మెంట్ (అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ) కు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ అనివార్యంగా ఉద్యోగాల భర్తీకి కాలయాపన చేయడానికి ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా..
కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 10 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
ప్రత్యేకంగా విన్నవించాం
ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి అనుమతివ్వాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరాం. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో నెలకొన్న బోధన సిబ్బంది కొరతను తీర్చాలని విన్నవించాం.– ఆచార్య ఎస్ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ అనంతపురం