వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ
- 242 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
- వచ్చే నెల 20 వరకు దరఖాస్తు గడువు
- రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 242 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 185 వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 22 వ్యవసాయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 హోం సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 19 బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 20 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దరఖాస్తు కాపీలను అదే నెల 29 సాయంత్రం 4 గంటల్లోపు పంపాల్సి ఉంటుందన్నారు.
అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎక్స్‌టెన్షన్, మైక్రోబయాలజీ, అగ్రోనమీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, ప్లాంట్ పెథాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, స్టాటిటిక్స్ అండ్ మ్యాథ్స్, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టుల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీలో 5 సబ్జెక్టుల కోసం భర్తీ చేస్తారు.
హోం సైన్స్‌లోనూ ఐదు సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీచేస్తారు. రిజర్వేషన్లు, పోస్టుల పూర్తి వివరాలను www.pjtsau.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని, ఈ సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ చేస్తారు.