Professor Jayashankar Agricultural University
-
సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సు ఫీజు రూ. 14 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజుల కారణంగా సీట్లు మిగిలిపోతున్నా పేద, గ్రామీణ విద్యార్థులకు భారంగా మారుతున్నా విశ్వవిద్యాలయం పునఃసమీక్ష చేయట్లే దన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు ఏకంగా రూ. 14 లక్షలను ఫీజుగా వర్సిటీ ఖరారు చేసింది. అలాగే బీఎస్సీ ఉద్యాన కోర్సుకు రూ. 9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ. 34 లక్షలు వసూలు చేస్తోంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అవే ఫీజులు ఉంటా యని చెబుతున్నా విద్యార్థుల మొరను మాత్రం ఆలకించట్లేదు. వ్యవసాయ, ఉద్యాన సీట్లలో 40% గ్రామీణ ప్రాంతాల్లో ఎకరా కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రిజర్వు చేశారు. కాబట్టి ఆయా కుటుంబాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 219 సీట్లకు అధిక ఫీజులు...: ఇంటర్లో బైపీసీ చదివి తెలంగాణ ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 దరఖాస్తుకు చివరి తేదీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో 475 సాధారణ సీట్లు, 154 పేమెంట్ సీట్లు, సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్‌లో 38 సాధారణ సీట్లు, ఐదు పేమెంట్ సీట్లు, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ హార్టీకల్చర్‌లో 170 సాధారణ సీట్లు, 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి. అలాగే పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విద్యాలయం పరిధిలోని 3 కళాశాలల్లో బీవీఎస్సీ అండ్ యానిమల్ హజ్బెండరీలో 174సీట్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 28, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలో ఉన్న ఫిషరీస్ సైన్స్ కళాశాలల్లో బీఎఫ్ఎస్సీలో 11 సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది. ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో 20 సీట్లు, ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. మొత్తంగా 219 సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐకార్ గుర్తింపులేని ప్రైవేటు కాలేజీల్లోనూ వ్యవసాయ కోర్సులు...: రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ వ్యవసాయ కోర్సులున్నాయి. అయితే ఆయా కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు లేకపోవడంతో ఆయా సీట్లలో చేరే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. నాలుగేళ్లు కోర్సు నిర్వహించాక ఐకార్ తనిఖీలు చేసి అనుమతి ఇస్తేనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ అనుమతి రాకుంటే అందులో చదివిన విద్యార్థులు వ్యవసాయ వర్సిటీలోని పీజీ కోర్సులకు అనర్హులవుతారని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా ప్రైవేటు కాలేజీలు కోర్సు కాలానికి రూ. 10 లక్షలపైనే ఫీజు వసూలు చేస్తున్నాయి. -
పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటపొలాల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా 53 శాతం నేలల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు తేలింది. 208 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 54 మండలాల్లో ఓ మోస్తరు, 154 మండలాల్లో అత్యధికస్థాయిలో ఉన్నట్లు తేల్చింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మండలాల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. నిజామాబాద్‌లో 27 మండలాలకుగానూ 26 మండలాల్లో అధికనిల్వలు ఉన్నట్లు తేలింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకుగానూ 20 మండలాల్లో, కరీంనగర్లో 16 మండలాలకుగానూ అన్నిచోట్లా, పెద్దపల్లిలో 14 మండలాలకుగానూ అన్నిచోట్లా, సిరిసిల్లలో 13 మండలాలకుగానూ అన్ని మండలాల్లోనూ అధిక భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని తేలింది. పంటకు అవసరమైన భాస్వరాన్ని డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తారు. పంటకు వేసిన ఎరువులో కేవలం 15–20 శాతం ఎరువునే పంట వినియోగించుకుంటుంది. మిగిలిన 80 శాతం కరగని స్థితిలో భూమిపొరల్లో ఉండిపోతుంది. అయినప్పటికీ రైతులు విచ్చలవిడిగా ఎరువులను వినియోగిస్తూనే ఉన్నారని విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. కాగా, ఎరువుల ధరలను కూడా కేంద్రం భారీగా పెంచింది. దీంతో రైతుకు పెట్టుబడి ఖర్చు అధికమయ్యే ప్రమాదం ఏర్పడింది. పొలాల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను కరిగించి మళ్లీ పంటకు ఉపయోగపడేలా చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఫాస్పేట్ సాల్యుబింగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ) తయారు చేశారు. ఇది పౌడర్, ద్రవరూపంలో అన్ని ఎరువుల షాపుల్లో లభిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతులకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. -
నెలకు 12.6 కిలోలు
సాక్షి, హైదరాబాద్: బతకాలంటే తినాల్సిందే.. అలా అని ఏదిపడితే అది తినలేం. జిహ్వకో రుచి అన్నట్టు అందరూ అన్నీ ఇష్టపడరు. ప్రీతికరమైన పదార్థాలను ఇష్టంగా తినేస్తుంటాం. కానీ ఎంత తింటున్నామో లెక్కించం. రాష్ట్ర ప్రజ లు ఆహారంగా ఎక్కువ ఏం తింటున్నారు, ఆహా ర పదార్థాల కోసం నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఆర్ఏఐ)తో కలసి ఇటీవల సర్వే నిర్వహించింది. 31 జిల్లా ల్లో 6,200 కుటుంబాలను పలకరించి ఆహార అలవాట్లను అడిగి తెలుసుకుంది. సర్వే లోని ముఖ్యాంశాలు ఇలా.. పప్పులు సమానంగా పప్పుల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో సమానంగానే ఉందని సర్వేలో తేలింది. నెలకు సగటున ప్రతి వ్యక్తి కనీసం 1.74 కిలోల పప్పులు తింటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2.69, సూర్యాపేటలో 1.3 కిలోల చొప్పున పప్పుల వినియోగం జరుగుతోంది. పప్పుల్లో 41% కందిపప్పు తింటుండగా 18 % చొప్పున పెసరపప్పు, మినపపప్పు వినియోగిస్తున్నారు. భద్రాద్రిలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ సుగంధ ద్రవ్యాల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు సగటున ప్రతి వ్యక్తి 636 గ్రాముల సుగంధ ద్రవ్యాలు తీసుకుంటుండగా భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా 920 గ్రాములు, మెదక్‌లో అత్యల్పంగా 440 గ్రాములు తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా అల్లం 146, చింతపండు 141, ఎండుమిరప 98 గ్రాముల చొప్పున వినియోగిస్తున్నారు. 94.5% కుటుంబాలు మాంస ప్రియులే మాంసం తింటున్న వారు రాష్ట్రంలో ఎక్కువేనని తేలింది. సర్వే జరిగిన కుటుంబాల్లో 94% మంది తాము మాంసాహారులమేనని చెప్పారు. నెలకు సగటున ప్రతి వ్యక్తి 1.38 కిలోలు (మాంసం, చేపలు, గుడ్లు కలిపి) తింటున్నారు. ఇందులో చికెన్ 550 గ్రాములు ఉంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రతి వ్యక్తి 1.91 కిలోల మాంసం తింటుండగా వికారాబాద్‌లో 1.06 కిలోలు తింటున్నారని వెల్లడైంది. పాల ఖిల్లా... సిరిసిల్ల పాల వినియోగానికి వస్తే నెలకు సగటున 4.58 లీటర్ల తలసరి వినియోగం జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎక్కువగా పాలు తాగుతున్నారని తేలింది. సిరిసిల్ల జిల్లాలో సగటున 6.27 లీటర్లు తాగుతుండగా అతితక్కువగా ఆదిలాబాద్‌లో 2.34 లీటర్లే తాగుతున్నారు. పాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందున్నాయని తేలింది. పట్టణ ప్రాంత ప్రజలు నెల కు 5.09 లీటర్ల పాలను తాగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో 3.86 లీటర్లు తాగుతున్నారు. ప్రతి వ్యక్తి సగటున నెలకు 920 గ్రా ముల పెరుగు తింటున్నాడని సర్వేలో తేలింది. నూనె విషయానికి వస్తే వంటకు వినియోగించే నూనెలను సగటున ప్రతి వ్యక్తి 1.22 లీటర్లు వినియోగిస్తున్నాడు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా (1.4 లీటర్లు), వికారాబాద్ ప్రజలు తక్కువగా (0.99 లీటర్లు) వినియోగిస్తున్నారు. కూరగాయల విషయానికి వస్తే ఎక్కువగా టమాటా (నెలకు కిలో) తింటుండగా ఆ తర్వాత ఆలుగడ్డలు (510 గ్రాములు) తింటున్నారు. ఉల్లిగడ్డ కూడా నెలకు కిలో చొప్పున వినియోగిస్తుండగా అరటిపండ్లు నెలకు కనీసం 5 తింటున్నారు. ఇక ఆహార పదార్థాల కోసం నెలకు సగటున రూ. 2,156 ఖర్చవుతుండగా అందులో ధాన్యం కోసం 19% ఖర్చు పెడుతున్నారని, పాల ఉత్పత్తుల కోసం 15 % ఖర్చవుతోందని సర్వేలో వెల్లడైంది. యాదాద్రిలో అత్యధికంగా... ఆహారం కింద రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నెలకు సగటున 12.6 కిలోలు ధాన్యం తింటున్నారని సర్వేలో తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 17.5 కిలోలు తింటుంటే మంచిర్యాల జిల్లాలో 10.5 కిలోల ధాన్యం వినియోగిస్తున్నారని వెల్లడైంది. ప్రాంతాలవారీగా పరిశీలిస్తే గ్రామీ ణ ప్రాంతాల్లో నెలకు 14.1 కిలోలు, పట్టణ ప్రాంతాల్లో 11.46 కిలోలు తీసుకుంటున్నరు. సర్వే నిర్వహించిన కుటుంబాల్లో 77 శాతం మంది ధాన్యాల్లో ఎక్కువగా బియ్యా న్నే ఆహారంగా తీసుకుంటున్నారు. -
22న దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో, వ్యవసాయ, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాలోని సీట్ల భర్తీ కోసం గురువారం (22న)కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ తెలిపారు. వివిధ విభాగాల డాక్టర్ల బృందం, డీన్స్ కమిటీ అభ్యర్థులు విద్యార్థుల అర్హతలను, సామర్థ్యాలను పరిశీలిస్తారని చెప్పారు. వివిధ డిప్లొమా కోర్సులకు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు (బైపీసీ స్ట్రీమ్) ఆన్లైన్లో పీహెచ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారే హాజరుకావాలని వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో రావాలని, వివరాలకు (www.pjtsau.edu.in) చూడవచ్చన్నారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన సీట్ల భర్తీ.. వ్యవసాయ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల్లో (వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన) సీట్ల భర్తీకి ఈ నెల 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సుధీర్ కుమార్ తెలిపారు. ఎన్సీసీ డైరెక్టరేట్ ఆఫీసర్స్ సమక్షంలో కౌన్సెలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు డిప్లొమా కోర్సులకు రూ.12,200 (యూనివర్సిటీ పాలిటెక్నిక్స్), రూ.16,600 (ప్రైవేటు పాలిటెక్నిక్స్), డిగ్రీ కోర్సులకు రూ.36,450తో హాజరుకావాలని తెలిపారు. ఎన్సీసీ ఆఫీసర్ ప్రాధాన్యతలను సూచిస్తారని పేర్కొన్నారు. తర్వాత సీట్లను ప్రాధాన్యతల ఆధారంగా, టీఎంసెట్– 2019 ర్యాంకుల ప్రకారం భర్తీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. -
నైరుతి ఆలస్యం.. తగ్గనున్న వర్షపాతం
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జూన్‌లో సాధారణ వర్షపాతంలో 60–70 శాతం మేర తక్కువ నమోద య్యే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థతో కలిసి రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయ సంబంధిత అంశాలపై శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే 60 నుంచి 70 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టులో దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో 10 నుంచి 20 శాతం మేర అధిక వర్షపాతం నమోదవుతుందని 2 సంస్థలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతుండటంతో కృష్ణా బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లకు వరద ఆలస్యమ య్యే అవకాశం ఉంది. రైతులు వర్షాధార పంటలు వెంటనే వేయకుండా.. దుక్కులు సిద్ధం చేసుకోవా లని మెట్ట పరిశోధనా సంస్థ అధికారులు సూచిం చారు. కనీసం 50 నుంచి 60 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే సోయా, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు వేసుకోవాలని తెలిపారు. -
వ్యవసాయ వర్సిటీలో ఫీజుల దందా
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఫీజు దందా మొదలుపెట్టింది. వ్యవసాయ సీట్లకు డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాల్లోకి వెళుతున్నారన్న సాకుతో సీట్లు పెంచుతూ భారీ ఫీజులకు తెరలేపింది. వంద సీట్లు పెంచాలని, అందులో 75 సీట్లలో ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి సాధారణ ఫీజులు కలుపుకుంటే కోర్సు మొత్తానికి రూ.8 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. మరో 25 సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద పరిగణించి ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర ఫీజుతోపాటు ప్రవేశ సమయంలో రూ.4.76 లక్షలు (6,800 అమెరికా డాలర్లు) అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఎన్ఆర్ఐ సీటు కోర్సు మొత్తానికి, సాధారణ ఫీజుతో కలిపి రూ.12 లక్షలకుపైగా ఖర్చు కానుందని వర్సిటీ వర్గాలు వివరించాయి. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. అకడమిక్ కౌన్సిల్ ఆమోదం... వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అధ్యక్షతన జరి గిన వర్సిటీ 10వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం పలు తీర్మానాలు చేసిందని సుధీర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించి బీఎస్సీ వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఈ నేపథ్యంలో వర్సి టీలో మరో వంద సీట్లు పెంచాలని ప్రతిపాదించిన ట్లు పేర్కొన్నారు. 75 పేమెంట్ సీట్లు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తామని, రిజర్వేషన్ విధానం పాటిస్తామని తెలిపారు. ఈ సీట్లకు సాధారణ ఫీజుతోపాటు అదనంగా ఏడాదికి రూ.లక్షా 50 వేలు, ఎన్ఆర్ఐ కోటాలోని 25 సీట్లకు సాధారణంగా కోర్సుకు చెల్లించే ఫీజుతోపాటు ఏడాదికి రూ.లక్షా 50 వేలు అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్కోర్సు సీట్లను 59 నుంచి 75కి పెం చుతూ నిర్ణయం తీసుకున్నామని, వర్సిటీ పరిధిలో ఉన్న పది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్యను 330 నుంచి 220కి తగ్గిస్తున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదనల్ని వర్సిటీ కౌన్సిల్ ఆమోదించిన తరు వాత ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. -
వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీ
242 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే నెల 20 వరకు దరఖాస్తు గడువు రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 242 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 185 వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 22 వ్యవసాయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 హోం సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 19 బ్యాక్లాగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 20 సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దరఖాస్తు కాపీలను అదే నెల 29 సాయంత్రం 4 గంటల్లోపు పంపాల్సి ఉంటుందన్నారు. అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎక్స్టెన్షన్, మైక్రోబయాలజీ, అగ్రోనమీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, ప్లాంట్ పెథాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, స్టాటిటిక్స్ అండ్ మ్యాథ్స్, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టుల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీలో 5 సబ్జెక్టుల కోసం భర్తీ చేస్తారు. హోం సైన్స్‌లోనూ ఐదు సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీచేస్తారు. రిజర్వేషన్లు, పోస్టుల పూర్తి వివరాలను www.pjtsau.ac.in వెబ్సైట్లో చూడొచ్చని, ఈ సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. ఇంటర్వ్యూల ఆధారంగానే భర్తీ చేస్తారు.