సాక్షి, హైదరాబాద్: బతకాలంటే తినాల్సిందే.. అలా అని ఏదిపడితే అది తినలేం. జిహ్వకో రుచి అన్నట్టు అందరూ అన్నీ ఇష్టపడరు. ప్రీతికరమైన పదార్థాలను ఇష్టంగా తినేస్తుంటాం. కానీ ఎంత తింటున్నామో లెక్కించం. రాష్ట్ర ప్రజ లు ఆహారంగా ఎక్కువ ఏం తింటున్నారు, ఆహా ర పదార్థాల కోసం నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఆర్‌ఏఐ)తో కలసి ఇటీవల సర్వే నిర్వహించింది. 31 జిల్లా ల్లో 6,200 కుటుంబాలను పలకరించి ఆహార అలవాట్లను అడిగి తెలుసుకుంది. సర్వే లోని ముఖ్యాంశాలు ఇలా..
పప్పులు సమానంగా
పప్పుల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో సమానంగానే ఉందని సర్వేలో తేలింది. నెలకు సగటున ప్రతి వ్యక్తి కనీసం 1.74 కిలోల పప్పులు తింటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2.69, సూర్యాపేటలో 1.3 కిలోల చొప్పున పప్పుల వినియోగం జరుగుతోంది. పప్పుల్లో 41% కందిపప్పు తింటుండగా 18 % చొప్పున పెసరపప్పు, మినపపప్పు వినియోగిస్తున్నారు.
భద్రాద్రిలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ
సుగంధ ద్రవ్యాల వినియోగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు సగటున ప్రతి వ్యక్తి 636 గ్రాముల సుగంధ ద్రవ్యాలు తీసుకుంటుండగా భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా 920 గ్రాములు, మెదక్‌లో అత్యల్పంగా 440 గ్రాములు తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా అల్లం 146, చింతపండు 141, ఎండుమిరప 98 గ్రాముల చొప్పున వినియోగిస్తున్నారు.
94.5% కుటుంబాలు మాంస ప్రియులే
మాంసం తింటున్న వారు రాష్ట్రంలో ఎక్కువేనని తేలింది. సర్వే జరిగిన కుటుంబాల్లో 94% మంది తాము మాంసాహారులమేనని చెప్పారు. నెలకు సగటున ప్రతి వ్యక్తి 1.38 కిలోలు (మాంసం, చేపలు, గుడ్లు కలిపి) తింటున్నారు. ఇందులో చికెన్ 550 గ్రాములు ఉంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రతి వ్యక్తి 1.91 కిలోల మాంసం తింటుండగా వికారాబాద్‌లో 1.06 కిలోలు తింటున్నారని వెల్లడైంది.
పాల ఖిల్లా... సిరిసిల్ల
పాల వినియోగానికి వస్తే నెలకు సగటున 4.58 లీటర్ల తలసరి వినియోగం జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎక్కువగా పాలు తాగుతున్నారని తేలింది. సిరిసిల్ల జిల్లాలో సగటున 6.27 లీటర్లు తాగుతుండగా అతితక్కువగా ఆదిలాబాద్‌లో 2.34 లీటర్లే తాగుతున్నారు. పాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందున్నాయని తేలింది. పట్టణ ప్రాంత ప్రజలు నెల కు 5.09 లీటర్ల పాలను తాగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో 3.86 లీటర్లు తాగుతున్నారు. ప్రతి వ్యక్తి సగటున నెలకు 920 గ్రా ముల పెరుగు తింటున్నాడని సర్వేలో తేలింది.
నూనె విషయానికి వస్తే వంటకు వినియోగించే నూనెలను సగటున ప్రతి వ్యక్తి 1.22 లీటర్లు వినియోగిస్తున్నాడు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా (1.4 లీటర్లు), వికారాబాద్ ప్రజలు తక్కువగా (0.99 లీటర్లు) వినియోగిస్తున్నారు. కూరగాయల విషయానికి వస్తే ఎక్కువగా టమాటా (నెలకు కిలో) తింటుండగా ఆ తర్వాత ఆలుగడ్డలు (510 గ్రాములు) తింటున్నారు. ఉల్లిగడ్డ కూడా నెలకు కిలో చొప్పున వినియోగిస్తుండగా అరటిపండ్లు నెలకు కనీసం 5 తింటున్నారు. ఇక ఆహార పదార్థాల కోసం నెలకు సగటున రూ. 2,156 ఖర్చవుతుండగా అందులో ధాన్యం కోసం 19% ఖర్చు పెడుతున్నారని, పాల ఉత్పత్తుల కోసం 15 % ఖర్చవుతోందని సర్వేలో వెల్లడైంది.
యాదాద్రిలో అత్యధికంగా...
ఆహారం కింద రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నెలకు సగటున 12.6 కిలోలు ధాన్యం తింటున్నారని సర్వేలో తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 17.5 కిలోలు తింటుంటే మంచిర్యాల జిల్లాలో 10.5 కిలోల ధాన్యం వినియోగిస్తున్నారని వెల్లడైంది. ప్రాంతాలవారీగా పరిశీలిస్తే గ్రామీ ణ ప్రాంతాల్లో నెలకు 14.1 కిలోలు, పట్టణ ప్రాంతాల్లో 11.46 కిలోలు తీసుకుంటున్నరు. సర్వే నిర్వహించిన కుటుంబాల్లో 77 శాతం మంది ధాన్యాల్లో ఎక్కువగా బియ్యా న్నే ఆహారంగా తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment