సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజుల కారణంగా సీట్లు మిగిలిపోతున్నా పేద, గ్రామీణ విద్యార్థులకు భారంగా మారుతున్నా విశ్వవిద్యాలయం పునఃసమీక్ష చేయట్లే దన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు ఏకంగా రూ. 14 లక్షలను ఫీజుగా వర్సిటీ ఖరారు చేసింది.
అలాగే బీఎస్సీ ఉద్యాన కోర్సుకు రూ. 9 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ. 34 లక్షలు వసూలు చేస్తోంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అవే ఫీజులు ఉంటా యని చెబుతున్నా విద్యార్థుల మొరను మాత్రం ఆలకించట్లేదు. వ్యవసాయ, ఉద్యాన సీట్లలో 40% గ్రామీణ ప్రాంతాల్లో ఎకరా కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రిజర్వు చేశారు. కాబట్టి ఆయా కుటుంబాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
219 సీట్లకు అధిక ఫీజులు...: ఇంటర్‌లో బైపీసీ చదివి తెలంగాణ ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఫిషరీస్ సైన్స్‌లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 దరఖాస్తుకు చివరి తేదీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్‌లో 475 సాధారణ సీట్లు, 154 పేమెంట్ సీట్లు, సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్‌లో 38 సాధారణ సీట్లు, ఐదు పేమెంట్ సీట్లు, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రెండు కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్ హార్టీకల్చర్‌లో 170 సాధారణ సీట్లు, 40 పేమెంట్ సీట్లు ఉన్నాయి.
అలాగే పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విద్యాలయం పరిధిలోని 3 కళాశాలల్లో బీవీఎస్‌సీ అండ్ యానిమల్ హజ్బెండరీలో 174సీట్లు, వనపర్తి జిల్లా పెబ్బేరులో 28, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలో ఉన్న ఫిషరీస్ సైన్స్ కళాశాలల్లో బీఎఫ్‌ఎస్‌సీలో 11 సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది. ఇక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్‌లో 20 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. మొత్తంగా 219 సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఐకార్ గుర్తింపులేని ప్రైవేటు కాలేజీల్లోనూ
వ్యవసాయ కోర్సులు...: రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు కాలేజీల్లోనూ వ్యవసాయ కోర్సులున్నాయి. అయితే ఆయా కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) గుర్తింపు లేకపోవడంతో ఆయా సీట్లలో చేరే విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
నాలుగేళ్లు కోర్సు నిర్వహించాక ఐకార్ తనిఖీలు చేసి అనుమతి ఇస్తేనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ అనుమతి రాకుంటే అందులో చదివిన విద్యార్థులు వ్యవసాయ వర్సిటీలోని పీజీ కోర్సులకు అనర్హులవుతారని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా ప్రైవేటు కాలేజీలు కోర్సు కాలానికి రూ. 10 లక్షలపైనే ఫీజు వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment