సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ రాష్ట్రంలో 1,51,419 ప్రసవాలు జరగ్గా ఇందులో ఏకంగా 99.99 శాతం అంటే 1,51,405 ప్రసవాలు ఆస్పత్రుల్లోనే చేశారు. కేవలం 0.01 శాతం మాత్రమే ఆస్పత్రుల బయట జరిగాయి. వీటిని కూడా అధిగమించి వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలుండగా కాకినాడ (99.98), అల్లూరి సీతారామరాజు (99.82), శ్రీ సత్యసాయి (99.78), చిత్తూరు (99.98) మినహా మిగిలిన 22 జిల్లాల్లో వందకు వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగాయి.
46.19 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో..
ఒకప్పుడు మొత్తం ప్రసవాల్లో 30–35 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉండేవి. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. దీంతోపాటు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం జరిగితే కలిగే ప్రయోజనాలపై ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకూ జరిగిన ప్రసవాల్లో 46.19 శాతం అంటే 69,932 ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేపట్టారు. పార్వతీపురం మన్యంలో 85.11 శాతం, అనకాపల్లిలో 75.12 శాతం ప్రసవాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే
నిర్వహించారు.
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేస్తున్నాం. పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే అసలు ప్రసవాలే చేయని పీహెచ్‌సీలను గుర్తించాం. వాటిలో ప్రసవాలు చేసేలా చర్యలు చేపట్టాం. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల్లో లేబర్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనులు నడుస్తున్నాయి.
– జె.నివాస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment