బషీరాబాద్ : జవహర్ బాలారోగ్య రక్ష పథకానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకోసం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని విద్యాశాఖ, వైద్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. అయితే విద్యాధికారులు మా కేందుకులే అంటు చేతులు దులుపుకుంటే వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో ప్రారంభమైన ఈ పథకం రెండేళ్లపాటు సజావుగానే సాగినా ఈ విద్య సంవత్సరంలో నిర్లక్ష్యానికి గురైంది.
అమలుకు దూరం
మండలంలో 50 ప్రాథ మిక, రెండు ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 6632 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్య,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో విద్యార్థులకు వారానికోసారి వైద్య పరీక్షలు చేయాలి. ఉచితంగా మందులు అందజేయాలి. అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందజేయాలి. ఆరోగ్యకార్డులో విద్యార్థుల వైద్య సమాచారాన్ని నమోదు చేయాలి. అయితే దీన్ని ఆచరణలో పెట్టడంలో విఫలం అవుతున్నారు.
వైద్యులు ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలలోనూ వైద్య పరీక్షలు చేసిన దాఖలాలు లేవు.గ్రామాలలో ఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు సైతం పాఠశాలలను సందర్శించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే ఆస్పత్రులకే మొక్కుబడిగా వచ్చే వైద్యాధికారులు ఇక గ్రామాలలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు ఎం చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
బాలారోగ్యానికి గ్రహణం..!
Published Mon, Sep 8 2014 12:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement