Jawahar Bala Arogya Raksha scheme
-
బాలారోగ్యానికి గ్రహణం..!
బషీరాబాద్ : జవహర్ బాలారోగ్య రక్ష పథకానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకోసం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని విద్యాశాఖ, వైద్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. అయితే విద్యాధికారులు మా కేందుకులే అంటు చేతులు దులుపుకుంటే వైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. 2010లో ప్రారంభమైన ఈ పథకం రెండేళ్లపాటు సజావుగానే సాగినా ఈ విద్య సంవత్సరంలో నిర్లక్ష్యానికి గురైంది. అమలుకు దూరం మండలంలో 50 ప్రాథ మిక, రెండు ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 6632 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్య,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో విద్యార్థులకు వారానికోసారి వైద్య పరీక్షలు చేయాలి. ఉచితంగా మందులు అందజేయాలి. అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందజేయాలి. ఆరోగ్యకార్డులో విద్యార్థుల వైద్య సమాచారాన్ని నమోదు చేయాలి. అయితే దీన్ని ఆచరణలో పెట్టడంలో విఫలం అవుతున్నారు. వైద్యులు ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలలోనూ వైద్య పరీక్షలు చేసిన దాఖలాలు లేవు.గ్రామాలలో ఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు సైతం పాఠశాలలను సందర్శించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలున్నాయి. అయితే ఆస్పత్రులకే మొక్కుబడిగా వచ్చే వైద్యాధికారులు ఇక గ్రామాలలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు ఎం చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కార్డులిచ్చాం.. వైద్యం చేరుుస్తాం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ‘ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సర్వశిక్షాభియూన్ ప్రాజెక్ట్ అధికారి కె.విశ్వనాథ్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు స్పందించారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద విద్యార్థులందరికీ ఆరోగ్య రక్ష కార్డులు ఇచ్చామని, త్వరలోనే వైద్య పరీక్షలు జరిపించి మందులు ఇచ్చేందుకు, అవసరమైతే మెరుగైన వైద్యం చేరుుంచేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 3.96 లక్షల మంది ఉన్నారని, సర్వశిక్షాభియాన్, విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం వారందరి కోసం ఆరోగ్య రక్ష కార్డులను పాఠశాలలకు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, బంద్‌ల కారణంగా గత ఏడాది ఈ పథకం అమలుపై పర్యవేక్షణ చేయలేకపోరుునట్టు వివరణ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సర్వశిక్షాభియాన్ సమన్వయంతో సమగ్ర ప్రణాళికను రూపొందించామని తెలిపారు. దీనికోసం నియమించిన కమిటీ సమావేశాలను జూన్ 30న, జూలై 7న రెండు శాఖల సమన్వయంతో నిర్వహించామని పేర్కొన్నారు. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. జూన్ 12న పాఠశాలల్ని తెరిచినప్పటికీ వేసవి తీవ్రత కారణంగా ఆరోగ్య రక్ష కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించలేకపోయామన్నారు. ఇకపై పూర్తిస్ధాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
ఆరోగ్య రక్ష.. అందని ద్రాక్ష
* అటకెక్కిన ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకం * ఆరోగ్య కార్డులిచ్చి సరిపెట్టిన అధికారులు * వైద్య పరీక్షల ఊసెత్తని వైద్యులు * పాఠశాల మెట్లెక్కని ఎంపీహెచ్ఏలు * పట్టించుకోని మండల కమిటీలు * జిల్లాలో 3.96 లక్షల విద్యార్థుల ఆరోగ్యం గాలిలోనే.. చాగల్లు : నేటి బాలలే రేపటి పౌరులు. వారే భారత భాగ్యవిధాతలు. అందుకే బాలలకు సకాలంలో సరైన పోషకాహారం అందాలి. వారు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగేలా చూడాలి. ఈ బాధ్యత కేవలం తల్లిదండ్రులది మాత్రమే కాదు.. ప్రభుత్వాలది కూడా. ఈ విషయూన్ని గుర్తెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2010 నవంబర్ 14న ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పేరిట ఓ పథకాన్ని ప్రారంభించారుు. ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి చదువుతున్న బాలలకు వైద్య పరీక్షలు చేయించడం, వారిలో ఏవైనా రుగ్మతలుంటే మందులు పంపిణీ చేయడం. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించడం వంటి సేవలను జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద ఉచితంగా అందించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లిప్తత కారణంగా ఈ పథకం పూర్తిగా అటకెక్కింది. బాలలకు మంచి చేస్తుందని అందరూ భావిం చినా ఆచరణలో విఫలమైంది. విద్యార్థులకు హడావుడిగా ఆరోగ్య కార్డులు జారీ చేసినా.. ఆ తరువాత పిల్లల స్థితిగతులపై సమీక్షలు, నిర్దేశించిన సమయూల్లో వైద్య పరీక్షలు చేయకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఏం చేయూలంటే... 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో కొందరు అనారోగ్య కారణాల వల్ల తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. దీనిని నివారించడంతోపాటు దేశానికి సంపూర్ణ ఆరోగ్యవంతమైన యువతను అందించాలనే లక్ష్యంతో జవహర్ బాల ఆరోగ్య పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు శ్రీకారం చుట్టారుు. ఈ పథకం అమలు బాధ్యతను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, రాజీవ్ విద్యామిషన్, పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టారుు. ఈ శాఖలు సమన్వ యంతో వ్యవహరిస్తూ విద్యార్థులకు నిర్దేశించిన సమయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అవసరమైన ఉచితంగా చికిత్సలు చేయడంతోపాటు మందులు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి. అవసరమైతే రిఫరల్ ఆసుపత్రికి తరలిం చి మెరుగైన వైద్యం అందించాలి. ఇందుకోసం విద్యార్థులకు గతంలోనే ఆరోగ్య రక్ష కార్డులను పంపిణీ చేశారు. ఆ కార్డులో విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి విధిగా ఏడాదిలో రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ప్రతి గురువారం స్కూల్ హెల్త్ డేగా పాటించాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని ఆరోగ్య రికార్డులో నమోదు చేయడం, ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రిఫరల్ డేగా పాటించి ఆ రోజు ఎంపీహెచ్ఏలు విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను సమీక్షిం చాలి. అనారోగ్యం వల్ల పాఠశాలలకు ఎక్కువ రోజులు హాజరుకాని విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి. కానీ.. జిల్లాలో ఎక్కడా ఇవేమీ అమలు కావడం లేదు. కమిటీలూ పడుకున్నాయ్ ప్రతి విద్యార్థికి వైద్య సేవలు అందించేవిధంగా ప్రభుత్వ వైద్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ పథకం అమలులో ఉపాధ్యాయులకూ బాధ్యత ఉంది. ప్రతి విద్యార్థికి ఆరోగ్య కార్డు అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలి. విద్యార్థి ఆరోగ్య సమాచారాన్ని కార్డులలో నింపి ఎంపీహెచ్‌ఏలకు సహకారం అందించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి పిల్లల ఆరోగ్య విషయాలను వారికి చెప్పడంతోపాటు రికార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రుల సంతకాలు సేకరించాలి. విద్యార్థులు పాఠశాలను విడిచి వేరే పాఠశాలకు వెళ్లే సమయంలో వారి ఆరోగ్య రికార్డును తల్లిదండ్రులకు అందజేయూలి. ఆరోగ్య విద్యపై పిల్లలకు అవగాహన కల్పించాలి. మొత్తంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు మండల స్థాయిలోనూ కమిటీలు ఉన్నారు. ఎంపీడీవో చైర్మన్‌గా, పీహెచ్సీ వైద్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ ఈ పథకం అమలుకు కృషి చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. అయితే, ఏ స్థాయిలోనూ.. ఏ ఒక్క అధికారి, కిందిస్థాయి ఉద్యోగులు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులకు వరంలా మారాల్సిన ఆరోగ్య రక్ష పథకం అక్కరకు రావడం లేదు. వైద్యసేవలకు 3.96 లక్షల మంది దూరం ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, ఎరుుడెడ్, మునిసిపల్, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో సుమారు 3.96 లక్షల మంది చదువుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం ఒక్క మందు బిళ్ల కూడా పంపిణీ చేయలేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో బాల ఆరోగ్యరక్ష పథకం ఒకటి ఉందనే విషయూన్నే అంద రూ మర్చిపోయూరు. ఏడాదిలో రెండుసార్లు ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సిన పీహెచ్సీ వైద్యాధికారులను ఇదేమని అడిగితే పీహెచ్సీ నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. వారానికి ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల్ని గమనించాల్సిన ఎంపీహెచ్ఏలు సైతం మొహం చాటేస్తున్నారు. ప్రతివారం విద్యార్థులకు ఐరన్/ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. చాలాచోట్ల వీటిని కూడా ఇవ్వడం లేదు. పరీక్షలు చేరుస్తాం జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అమలుకు నోచుకోకపోవడంపై రాజీవ్ విద్యామిషన్ కో-ఆర్డినేటర్ (ఐఈడీ) జి.నాగేశ్వరరావును వివరణ కోరగా... గత విద్యా సంవత్సరం ఈ పథకం కింద జిల్లాలోని 63 శాతం పాఠశాలల్లో వైద్య పరీక్షలు చేరుుంచామని, అప్పట్లో 56 శాతం మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిగాయని చెప్పారు. వైద్యుల కొరత, పాఠశాలలు సక్రమంగా తెరవకపోవడంతో పరీక్షలు సక్రమంగా చేయలేకపోయారని చెప్పారు. ఈ ఏడాది 3.96 లక్షల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. -
‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..!
కెరమెరి : బాల్యానికి భరోసా.. బాలల ఆరోగ్యాకి రక్షా అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అటకెక్కింది. కాగితాలకే పరిమిత మైంది. పిల్లలకు మంచి చేస్తుందని అందరూ భావించి సంతోషించినా ఆచరణలో మందగించింది. దీంతో ఈ పథకం 50శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేదు. హడావుడిగా ఆరోగ్య కార్డులు అందజేసిన అధికారులు ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం లేదు. పథకం అమలుకు కమిటీలు వేశామని, నెలనెలా వైద్య పరీక్షలు, విద్యార్థుల ప్రగతి వివరాల నమోదు చేస్తామని చెప్పినా అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పథకం ప్రారంభం ఇలా.. 2010 నవంబర్ 14న ఈ పథకం ప్రారంభమైంది. 1 నుంచి 10వ తరగతి పరకు పాఠశాలలో చదువుతున్న పిల్లలు పలు అనారోగ్య కారణాలతో హాజరు కావడం లేదని గుర్తించారు. దీన్ని నివారించడానికి పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా అవసరమైన మందులు, చికిత్సలు అందించాలనేది పథకం ఉద్దేశం. అమల్లో భాగంగా 1 నుంచి 10 తరగతి వరకు అందరికీ ఆరోగ్య రక్షా కార్డులు పంపిణీ చేశారు. కార్డుల్లో చిన్నారుల ఆరోగ్యం వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సి ఉంది. కార్డుల పంపిణీ తర్వాత వాటి ఊసే లేదు. మొదట్లో వైద్యులతో కొన్ని చోట్ల మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత తమ పనైపోయిందని చేతులు దులిపేసుకున్నారు. పథకం నిర్వహణ కోసం వేసిన కమిటీలు పత్తా లేకుండా పోయాయి. చాలాచోట్ల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కుప్పలుగా ఆరోగ్య రక్ష పుస్తకాలు.. జవహర్ బాల ఆరోగ్య రక్ష పేరుతో అధికారులు కరదీపికలను ముద్రించారు. వీటిలో విద్యార్థులకు ఎలా పరీక్షలు నిర్వహించాలి, పలు సూచనలు, సలహాల సమాచారం ఉంది. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో, ఎమ్మార్సీల్లో కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రతి నెలా పరీక్షలు చేయాల్సి ఉన్నప్పటికీ గత విద్యాసంవత్సరంలో ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోలేదు. పథకం ఆరంభంలో కొన్ని పాఠశాలలో ఈ పథకం పని చేయగా తర్వాత కనుమరుగైంది. ఇలా చేయాలి..! * మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా , ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, ఎంఈవోలు సభ్యులుగా ఉంటారు. * కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వారి సమక్షంలో పరీక్షలు జరిగేలా చూడాలి. వారి ఆరోగ్య సమాచారాన్ని మొత్తాన్ని ఆ కార్డులో నమోదయ్యేలా పర్యవేక్షించాలి. * ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రోజుగా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. * ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు జరిగేలా చూసే బాధ్యత తరగతి ఉపాధ్యాయుడితోపాటు ప్రధానోపాధ్యాయుడికి కూడా ఉంది. అలా జరుగుతుందో లేదో కమిటీ పర్యవేక్షించాలి. * పాఠశాల ఆరోగ్య పరీక్షలు జరిగేటప్పుడు తల్లితండ్రులను కూడా పిలిచి వారితో సదరు విద్యార్థి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని నమోదు చేశారో లేదో చూడాలి. * విద్యార్థుల తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు రికార్డుల్లో నమోదు అయ్యాయో లేదో పర్యవేక్షించాల్సి ఉంది. * అలాంటి దాఖలాలు అనేక ప్రభుత్వ పాఠశాల్లో కనిపించడం లేదు. ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే పిల్లలకు వైద్య పరీక్షలు అందడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. -
ఆరోగ్యానికి....రక్షా...శిక్షా!?
బోనకల్, న్యూస్‌లైన్ : కొండనాలుకకు మందిచ్చి.. ఉన్న నాలుకను ఊడగొట్టేటట్టుంది అధికారుల తీరు. జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకం ద్వారా రక్తహీనత నివారణకు పంపిణీ చేసిన మాత్రలు విద్యార్థులను అస్వస్థతకు గురిచేశాయి. 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ ఘటన బోనకల్ మండల పరిధిలోని మోటమర్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... మోటమర్రిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 300 మంది చదువుకుంటున్నారు. జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకంలో రక్తహీనత నివారణ కోసం అధికారులు సరఫరా చేసిన ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను ఉపాధ్యాయులు గురువారం విద్యార్థులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నభోజనం అనంతరం విద్యార్థులు వాటిని వేసుకున్నారు. పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు వైద్యం చేయించారు. శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మళ్లీ వాంతులు చేసుకున్నారు. కళ్లుతిరిగి పడిపోయారు. దీంతో ఉపాధ్యాయులు బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వైద్యాధికారి విజయచందర్ సెలవులో ఉండడంతో ఏఎన్ఎంలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు అక్కడే సెలైన్ ఎక్కించారు. తమ పిల్లలు మళ్లీ అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు మాత్రలు ఎలా ఇచ్చారని ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాలను సందర్శించిన అధికారులు పాఠశాలను మధిర డి ప్యూటీ డీఈఓ బానోతు రాములు, ఎంఈఓ ఎం.శ్యాంసన్ సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. ఇంత జరుగుతున్నా ైవైద్యులు రాకపోవడంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓపై గ్రామస్తులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈక్రమంలో జిల్లా వైద్యాధికారులకు డిప్యూటీ డీఈఓ సమాచారం అందించారు. మధిర నుంచి వైద్యాధికారులను పంపించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి మెరుగు పడకపోతే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. వైద్య శిబిరాన్ని 24 గంటలపాటు కొనసాగిస్తామన్నారు. ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను అధికారులు పరిశీలించారు. ఎక్స్పైరీ డేట్ 2015 వరకు ఉన్నా ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు రాయల శ్రీనివాసరావు, కంటెపూడి శ్రీనివాసరావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్, ఏఎన్ఎంలు లక్ష్మి, జయమ్మ, ఆశా కర్యాకర్తలు వైద్య సేవలు అందించారు. -
బాలల ఆరోగ్యానికి రక్షణేదీ..
పాఠశాలల్లో కానరాని జవహర్ బాల ఆరోగ్య రక్ష విద్యార్థుల్లో పెరుగుతున్న రక్తహీనత అందుబాటులో లేని హెచ్‌బీ పరీక్షల కిట్లు ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం పనితీరులో కనీస ప్రగతి లేదు. జిల్లాలో యువ క్లినిక్‌లు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఏడాదిలో ప్రతి పాఠశాలను రెండుసార్లు తనిఖీ చేసి వైద్య కార్యక్రమాలు విద్యార్థులకు అందుతున్నాయో లేదో చూడాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 12-17 సంవత్సరాల మధ్య యువత కోసం యువ క్లినిక్‌లు ప్రారంభించారు. ఇవి ఎక్కడున్నాయో యువతకు తెలీదు. యువతకు సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసి తగిన సేవలందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. 12-17 సంవత్సరాల మధ్య వారిలో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వరకు కేవలం యువతుల్లో మాత్రమే ఉండే రక్తహీనత ప్రస్తుతం యువకులకూ ఉంటోంది. ఫలితంగా శారీరక సమస్యలతో ఏ రంగంలోనూ రాణించలేకపోతున్నారు. యువతలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను నిర్ధారించేందుకు సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. జిల్లాలో 3,33,000 మంది విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తున్నారు. రక్తహీనత ఉన్నవారికి పాఠశాలల్లోనే ఐరన్ మాత్రలు ఇస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉంటే ఆరోగ్య కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 7 లక్షల ఐరన్ మాత్రలు పంపిణీ చేసినట్లు ఎన్ఆర్హెచ్ఎం నివేదికలో పేర్కొంది. వారానికి ఒక్కసారి మాత్రమే ఒక ఐరన్ మాత్రను ఒక్కో విద్యార్థికి అందించినట్లు నివేదికలో తెలిపారు. కౌమార దశలో ఉన్న వారికి మాత్రం ఎలాంటి సేవలు అందుబాటులో లేవు. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించడానికి పరీక్షలు చేసి నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే పలు అనారోగ్య సమస్యలకు దారి తీసే రక్తహీనతను గుర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద సామూహిక పరీక్షల వ్యవ స్థ లేదు. దీంతో విద్యార్థుల్లో రక్త హీనత సమస్య తీవ్రతను గుర్తించడంలో విఫలమవుతున్నారు. అందుబాటులో లేని హెచ్‌బీ పరీక్షల కిట్లు: 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న యువతకు డెస్సీ లీటర్‌కు రక్తంలో 14 గ్రాములకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలి. పరీక్షలు చేయకుండానే రక్త హీనత ఉందని గుర్తించే విద్యార్థుల్లో 9-14 మధ్య హిమోగ్లోబిన్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 8 శాతం మంది యువతలో 7 గ్రాముల వరకూ హిమోగ్లోబిన్ ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. బాలికల్లో 12.5 గ్రాములు ఉండాల్సి ఉండగా, 7-10 గ్రాముల మధ్య మాత్రమే ఉంటోంది. హెచ్‌బీ గుర్తించడానికి రక్త పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన కిట్లు పంపిణీ చేయకపోవడంతో ఎవరికి ఎంత శాతం హిమోగ్లోబిన్ ఉందో పూర్తిస్థాయిలో గుర్తించలేకపోతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం: విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పనిచేయాలి. కానీ ఈ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య ఉన్న వారికి పౌష్టికాహారంపై, శుభ్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్త్రీశిశు సంక్షేమ శాఖది. సమస్య ఉన్నట్లు గుర్తించాల్సింది వైద్య ఆరోగ్య శాఖ. చదువుకుంటున్న వారికి విద్యాసంస్థల్లో జబార్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించాలి. కానీ ఈ శాఖలు సమన్వయంతో వ్యవహరించడం లేదు. యువత ఆహారంలో సహజ సిద్ధంగా రక్తాన్ని పెంచే బెల్లం, ఆకుపచ్చటి కూరగాయలు, బచ్చలి కూర, గోంగూర, క్యారెట్, బీట్రూట్, మాంసాహారంలో లివర్ తీసుకుంటే రక్తం సమృద్ధిగా లభిస్తుంది. కనీసం వాటిపై అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వ శాఖలు విఫలమవుతున్నాయి.