ఆరోగ్యానికి....రక్షా...శిక్షా!? | students faced problems with iron tablets in jawahar bala arogya raksha scheme | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి....రక్షా...శిక్షా!?

Published Sat, Feb 15 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

students faced problems with iron tablets in jawahar bala arogya raksha scheme

బోనకల్, న్యూస్‌లైన్ : కొండనాలుకకు మందిచ్చి.. ఉన్న నాలుకను ఊడగొట్టేటట్టుంది అధికారుల తీరు. జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకం ద్వారా రక్తహీనత నివారణకు పంపిణీ చేసిన మాత్రలు విద్యార్థులను అస్వస్థతకు గురిచేశాయి. 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ ఘటన బోనకల్ మండల పరిధిలోని మోటమర్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... మోటమర్రిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 300 మంది  చదువుకుంటున్నారు.

 జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకంలో రక్తహీనత నివారణ కోసం అధికారులు సరఫరా చేసిన ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను ఉపాధ్యాయులు గురువారం విద్యార్థులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నభోజనం అనంతరం విద్యార్థులు వాటిని వేసుకున్నారు. పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు వైద్యం చేయించారు. శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మళ్లీ వాంతులు చేసుకున్నారు. కళ్లుతిరిగి పడిపోయారు.

దీంతో ఉపాధ్యాయులు బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వైద్యాధికారి విజయచందర్ సెలవులో ఉండడంతో ఏఎన్‌ఎంలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు అక్కడే సెలైన్ ఎక్కించారు. తమ పిల్లలు మళ్లీ అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు మాత్రలు ఎలా ఇచ్చారని ఉపాధ్యాయులను నిలదీశారు.

 పాఠశాలను సందర్శించిన అధికారులు
  పాఠశాలను  మధిర డి ప్యూటీ డీఈఓ బానోతు రాములు, ఎంఈఓ ఎం.శ్యాంసన్ సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. ఇంత జరుగుతున్నా ైవైద్యులు రాకపోవడంతో డిప్యూటీ డీఈఓ, ఎంఈఓపై గ్రామస్తులు ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈక్రమంలో జిల్లా వైద్యాధికారులకు డిప్యూటీ డీఈఓ సమాచారం అందించారు. మధిర నుంచి వైద్యాధికారులను పంపించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి మెరుగు పడకపోతే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు.

వైద్య శిబిరాన్ని 24 గంటలపాటు కొనసాగిస్తామన్నారు. ఐరన్, ఫొలిక్ యాసిడ్ మాత్రలను అధికారులు పరిశీలించారు. ఎక్స్‌పైరీ డేట్ 2015 వరకు ఉన్నా ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు రాయల శ్రీనివాసరావు, కంటెపూడి శ్రీనివాసరావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. హెల్త్ సూపర్‌వైజర్ రాజశేఖర్, ఏఎన్‌ఎంలు లక్ష్మి, జయమ్మ, ఆశా కర్యాకర్తలు వైద్య సేవలు అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement